‘వదల బొమ్మాళీ వదల’… అంటూ అరుంధతి సినిమాలో విలన్ సోనూసూద్ అరిచిన అరుపులు మనందర్నీ భయకంపితులు చేశాయి. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే… సోనూసూద్ స్థాయిలో కాకపోయినా కాస్త గట్టిగానే పొలికేక పెట్టారు. ఆ రాష్ట్రంలో ‘మహాయుతి’ కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే కూటమి తరపున బీజేపీ అత్యధిక స్థానాలు దక్కించుకున్న దరిమిలా, ఇప్పటివరకూ శివసేన తరపున సీఎం పీఠం మీద కూర్చున్న ఆయన ఇప్పుడు కక్కలేక మింగలేక ఉన్నారు. కూటమిలో ఎక్కువ స్థానాలు సంపాదించిన కమలం పార్టీ… ఇప్పటికే ముఖ్యమంత్రి స్థానంపై కన్నేసి, తమ తరపున ఎవర్ని సీఎం చేయాలనే అంశంపై సమాలోచనలు చేస్తోంది. ఈ క్రమంలోనే షిండే గాండ్రించారు. ‘ఎవరెన్ని చెప్పినా, ఎవరేం చేసినా, మేమే సీఎం పదవిని చేపట్టబోతున్నాం, శివసేనకు చెందిన వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉంటారు…’ అంటూ బీజేపీపై బాంబు పేల్చారు. తద్వారా తాను ముఖ్యమంత్రి పదవిని వదిలే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పారు. ఆయన చేసిన ఈ కామెంట్లు ఇప్పటికిప్పుడే కూటమిని ఇబ్బంది పెట్టలేవుగానీ, మున్ముందు ఎలా పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
-బి.వి.యన్.పద్మరాజు