– క్షేత్రస్థాయి అధికారుల పర్యవేక్షణ ఉండాలి
– డీఈవో నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం : ఎస్‌ఎఫ్‌ఐ
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రయివేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో పుస్తకాలు, యూనిఫామ్స్, స్టేషనరీ అమ్మకాలను నిషేధిస్తూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్ డీఈవో తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేవలం సర్క్యులర్‌కే పరిమితం కాకుండా నిరంతరం క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ ఉండాలని పేర్కొన్నారు. ప్రతియేటా ప్రయివేట్, కార్పొరేట్ స్కూళ్లలో యూనిఫాం, స్టేషనరీ పేరుతో కోట్ల రూపాయల దందా నడుస్తోందని, దీనికి వ్యతిరేకంగా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చేసిన పోరాటాల ఫలితమే డీఈవో నిర్ణయమని హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కె.అశోక్ రెడ్డి తెలిపారు. ప్రయివేట్, కార్పొరేట్ స్కూళ్లల్లో వాళ్లు చెప్పిన దగ్గరే యూనిఫామ్స్, బుక్స్ కొనుక్కోవాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకురావొద్దని, ఇలాంటి వాటిపై అధికారులు దృష్టిసారించి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్న తరుణంలో ప్రభుత్వం స్కూల్ ఫీజుల పెంపుపై ఎలాంటి నిర్ణయం ప్రకటించకముందే.. 10 నుంచి 30 శాతం వరకు ఫీజులు పెంచుతున్నారని చెప్పారు. ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ తరపున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.