– వారితో సంప్రదింపులు అవసరం : మధురా స్వామినాథన్ సూచన
న్యూఢిల్లీ : అన్నదాతలను నేరస్తులుగా చూడవద్దని హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కుమార్తె, ఆర్థికవేత్త మధురా స్వామినాథన్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ స్వామినాథన్‌కు అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించిన సందర్భాన్ని పురస్కరించుకొని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఏఆర్‌ఐ) మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న రైతులను దేశ రాజధానిలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడాన్ని ఆమె ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్య చేశారు. శాస్త్రవేత్తలు రైతులను సంప్రదించాలే కానీ వారిని నేరస్థులుగా చూడరాదని ఆమె హితవు పలికారు.
‘పంజాబ్ రైతులు ఢిల్లీ దిశగా కదులుతున్నారు. వారి కోసం హర్యానాలో జైళ్లను సిద్ధం చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. అన్నదాతలను అడ్డుకునేందుకు చేయాల్సిందంతా చేస్తున్నారు’ అని మధురా స్వామినాథన్ చెప్పారు. వారు రైతులే తప్ప నేరస్థులు కాదని సభికుల హర్షధ్వానాల మధ్య అన్నారు. ‘నేను దేశంలోని ప్రముఖ శాస్త్రవేత్తలందరినీ కోరుతున్నాను. అన్నదాతలతో మాట్లాడండి. మనం వారిని నేరస్థులుగా భావించకూడదు. సమస్యకు పరిష్కారం వెతకాలి. ఇది నా అభ్యర్థన. మనం స్వామినాథన్‌ను గౌరవించాలంటే భవిష్యత్ ప్రణాళికల కోసం రూపొందించే వ్యూహంలో రైతులను కూడా భాగస్వాములను చేయాలి’ అని కోరారు.
కనీస మద్దతు ధరల కోసం భారత రైతులకు ఓ చట్టం అవసరమని శాస్త్రవేత్త ఆర్‌బీ సింగ్ చెప్పారు. రైతుల సమస్యలను అధ్యయనం చేసిన స్వామినాథన్ కమిషన్‌లో ఆయన కూడా సభ్యుడిగా వ్యవహరించారు. రైతులు తాము పండించిన పంటకు సరైన ధర పొందాలంటే ఎంఎస్‌పీపై కొత్త చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉన్నదని సింగ్ తెలిపారు. అప్పుడే కమిషన్ చేసిన సిఫార్సులు సక్రమంగా అమలు జరుగుతాయని అన్నారు. పంట ఉత్పత్తి వ్యయం కంటే ఎంఎస్‌పీ యాభై శాతం అధికంగా ఉండాలన్న కమిషన్ సిఫారసును దేశమంతటా ఒకేలా అమలు చేయలేదని సింగ్ చెప్పారు.