పిల్లలకు డబ్బులు అలవాటు చేయకండి

పిల్లలకు డబ్బులు అలవాటు చేయకండిస్కూల్లో ఒక్కోసారి పుస్తకాల ప్రదర్శన జరుగవచ్చు. లేదా ఏదయినా ఆటవస్తువులు, వారిలో స్ఫూర్తిని పెంచే వస్తువుల ప్రదర్శన జరగవచ్చు. వాటిల్లో ప్రదర్శించే వస్తువులను కొనుక్కోవాలని పిల్లలు ఉబలాట పడొచ్చు. అటువంటప్పుడు డబ్బులు లేని పిల్లలు నిరాశకు గురయ్యే అవకాశముంది. వారిని నిరాశపర్చడం ఇష్టం లేక డబ్బులు ఇవ్వాలనుకుంటే అది సరైన విధానం కాదు. సాధారణంగా పిల్లల్ని తీసుకుని ఏదయినా పిక్నిక్‌కో, విజ్ఞాన యాత్రలకో తీసుకెళ్లినప్పుడు ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు తటస్థిస్తాయి.
ఎటువంటి పరిస్థితుల్లోనూ పిల్లలకు డబ్బులివ్వడం అలవాటు చేయకండి. పిల్లలు లంచ్‌ కొనుక్కోవల్సిన పరిస్థితి వచ్చినపుడు మాత్రం మీరు వారికి కావాల్సిన డబ్బును ఇచ్చి, ఆ విషయాన్ని వారి డైరీలో నమోదు చేసి, తరువాతి రోజు పిల్లలకు లంచ్‌కు సరిపడా డబ్బుని పంపాల్సిందిగా తల్లిదండ్రులకు నోట్‌ పంపించాలి. ప్రస్తుతం చాలా పాఠశాలల్లో యాజమాన్యం ముందుగానే కొంత సొమ్మును పిల్లల తల్లిదండ్రుల నుండి కట్టించుకుంటుంది. సంబంధిత వివరాలను మాత్రం క్లాసు టీచర్లే పుస్తకంలో రాస్తుంటారు.
విన్నవి నమ్మకండి: కొత్తగా క్లాస్‌ టీచర్‌గా వచ్చిన వాళ్లు క్రితంసారి క్లాస్‌ టీచర్‌ మాటలను ఆధారంగా చేసుకుని పిల్లలపై అభిప్రాయాలను ఏర్పరచుకోవద్దు. ప్రతి టీచర్‌కి విద్యార్థులతో స్వయంగా పిల్లలపై మంచి/ చెడు అభిప్రాయలు ఏర్పడతాయి. సాధారణంగా మంచిగా చదువుకునే పిల్లల గురించి చెప్పుకునే వార్తల కన్నా అల్లరి, ఆకతాయిగా ఉండి, సరిగ్గా పాఠం వినని పిల్లల వార్తలే ఎక్కువగా వినిపిస్తుంటాయి. వాటిని ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయండి. వాటిని ఆ టీచర్‌ సొంత అభిప్రాయాలుగానే పరిగణించండి. ఆ టీచర్ల మాటలు ప్రకారం మీరు పిల్లల్లో ఏదయినా మార్పుకోసం ప్రయత్నించినా వాటిలో సక్సెస్‌ అవకాశాలు చాలా తక్కువ. పిల్లలకు తమ గురించి స్కూల్లో ఉన్న అభిప్రాయాలు ఎలా వుంటాయో బాగా తెలుసు. స్నేహితులు ఏమనుకుంటున్నారు, క్లాసు టీచర్లు ఏమనుకుంటున్నారు, తమకు ఇంత అపకీర్తి ఎందుకు వచ్చింది వంటి విషయాల్లో వారికి పరిజ్ఞానం ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే తమపై మోపబడిన అపవాదును ఎలా తొలగించుకోవాలో తెలియదు. పైగా అపవాదునే ప్రామాణికంగా తీసుకుని, తమతో వ్యవహరించే వ్యక్తులతో సఖ్యతగా వుండలేరు. పైగా నిజంగానే మొండితనం, అల్లరి ఎక్కువగా చేస్తూ, చెడు పేరు తెచ్చుకున్న పిల్లలు కూడా బుద్ధిగా నడుచుకోవాలనే ధ్యాసను కలిగి ఉండరు. తమ ధోరణి ఇంతే అనే వైఖరిని చూపిస్తారు. అందుచేత మీరు విన్న వదంతులు వాస్తవాలైనా, కాకపోయినా, స్వయంగా మీ క్లాసు విద్యార్థులను చూసి, నిశితంగా గమనించి ఒక అభిప్రాయానికి రావడం చాలా ముఖ్యం. మీరు చూపించే పారదర్శకత పిల్లల మన్ననలను చూరగొంటుంది. మొండి పిల్లలను కూడా మీదయిన బాణీలో మార్చుకునే అవకాశం మీకు ఏర్పడుతుంది. మిగిలిన పిల్లలకు కూడా ఇదే వైఖరి ఉండాలని ప్రత్యేకంగా చెప్పకనే చెప్పిన వారవుతారు. ఈ రకమయిన వాతావరణాన్ని సృష్టించడం వల్ల, పిల్లలు తమ తోటి పిల్లల్లో ఎపుడూ మంచినే చూసే అవకాశం పెరుగుతుంది.
టీచింగ్‌ లైసెన్సును కోల్పోకండి : టీచర్‌ది సమాజంలో చాలా ఉన్నతమైన హోదా! దీనికి భిన్నంగా వ్యవహరిస్తే, అది ఆ వృత్తికే మాయని మచ్చ అవుతుంది. సమాజంలో మీరు తప్పనిసరిగా కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. టీచర్‌ అంటే పరిణతి చెందిన వ్యక్తి. కాబట్టి మీలో ఏమైనా చెడు వ్యసనాలు వుంటే వాటిని వదిలేయడం మంచిది. లేదంటే వాటివల్ల మీ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మీపై వున్న గౌరవాన్ని తగ్గిస్తుంది. గట్టిగా అరవడం, గొడవ పడడం లాంటివి చేస్తే టీచింగ్‌ లైసెన్స్‌ను కోల్పోయే ప్రమాదం కూడా వుంది.
రహస్యాలను కాపాడండి : పిల్లల గురించి మీకు రకరకాలయిన సమాచారం తెలుస్తుండవచ్చు, అయినా సరే… ఏ విద్యార్థి గురించైనా పాజిటివ్‌గానే చెప్పాలి. విద్యార్థికి సబంధించిన నిజాలు (లోపాలుంటే) తల్లిదండ్రులకు తప్ప, వారి చుట్టాలకైనా సరే, నెగిటివ్‌గా చెప్పకూడదు.
ముఖ్యంగా పిల్లల గ్రాండ్‌ పేరెంట్స్‌ తో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వారికి తమ మనమలు మనమరాండ్ల పట్ల చాలా నమ్మకం, ప్రేమ ఉంటాయి. మీరు చెప్పే కొన్ని విషయాలు, పిల్లల తల్లిదండ్రులకు వారి తల్లిదండ్రులకు నడుమ చిచ్చు రగిలినా ఆశ్చర్యపోనవసరం లేదు. కాబట్టి ఎవరితో మాట్లాడినా ఆచి తూచి మాట్లాడడం మీ వంతు బాధ్యత.

డా|| హిప్నో పద్మా కమలాకర్‌, 9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌, హిప్నో థెరపిస్ట్‌