విద్యుత్‌ సరఫరాపై అసత్య ప్రచారాలు చేయకండి

విద్యుత్‌ సరఫరాపై అసత్య ప్రచారాలు చేయకండి– వాటికి మమ్మల్ని బాధ్యుల్ని చేయకండి :టీఎస్‌పీఈజేఏసీవిజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కరెంటు కోతలు పేరుతో అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (టీఎస్‌పీఈజేఏసీ) విజ్ఞప్తి చేసింది. ఈ అసత్య ప్రచారాల వల్ల విద్యుత్‌ సంస్థల ఉద్యోగులు తీవ్ర ఒత్తిళ్లకు గురువుతున్నారనీ, లేని దానిని ఉన్నదిగా చూపించి, తమను ఎందుకు బదనాం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో నిర్వహించే వివిధ సమావేశాల్లో విద్యుత్‌ సరఫరా అంతరాయాలు జరుగుతున్నట్టు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సూర్యాపేటలో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత కేసీఆర్‌ నిర్వహించిన విలేకరుల సమావేశంలో కరెంటు కట్‌ చేశారని ప్రచారం జరిగింది. లైట్లు ఆరిపోయి, మైక్‌ కట్‌ కావడంతో కరెంటు కోతలపై కేసీఆర్‌ ఫైర్‌ అయ్యి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఆ తర్వాత టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ యాజమాన్యం జరిపిన విచారణలో కేసీఆర్‌ పాల్గొన్న భవనానికి ప్రయివేటు జనరేటర్‌తో ప్రయివేటు వ్యక్తులు కరెంటు సప్లరు చేసి, విలేకరుల సమావేశంలో వైర్లు పీకేసి, కరెంటు కోతలనే అభిప్రాయం కలిగించారని తేలిన విషయం తెలిసిందే. గతంలోనూ ఇదే తరహాలో అప్రకటిత కోతలు అంటూ సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జేఏసీ నేతలు, విద్యుత్‌ సంస్థల్లోని పలువురు ఇంజినీర్లు హైదరాబాద్‌ మింట్‌ కాంపౌండ్‌లోని 1104 యూనియన్‌ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. తప్పుడు ప్రచారాల వల్ల ఇంజినీర్లు అనేక అవస్థలు పడాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దుష్ప్రచారాలు చేయోద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని అన్ని కేటగిరీల విద్యుత్‌ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అందించడం కోసం, తామంతా అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు. ప్రస్తుత సీజన్లో అంచనాలకు మించి విద్యుత్‌ డిమాండ్‌ వస్తున్నా, తమ సిబ్బంది, ఇంజినీర్లు అనునిత్యం అప్రమత్తంగా ఉండి ఎలాంటి అంతరాయాలు లేకుండా విద్యుత్‌ సరఫరా చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో గతేడాది గరిష్ట డిమాండ్‌ 15,497 మెగావాట్లు ఉంటే ఈ ఏడాది ఇప్పటికే గరిష్ఠ డిమాండ్‌ 15,623 మెగావాట్లకు చేరిందని తెలిపారు. డిమాండ్‌ ఇంత పెరిగినా విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేకుండా తామంతా కష్టించి పని చేస్తున్నామన్నారు. ఆ శ్రమను గుర్తించకుండా, వినియోగదారుల అంతర్గత విద్యుత్‌ సమస్యలను సంస్థలకు ఆపాదిస్తూ దుష్ప్రచారాలు చేయడం సమంజసం కాదని చెప్పారు. సమావేశంలో జేఏసీ చైర్మెన్‌ జీ సాయిబాబు, కన్వీనర్‌ పీ రత్నాకరరావు, కో చైర్మెన్‌ ఈ శ్రీధర్‌, కో కన్వీనర్‌ పీ బీసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.