పచ్చటి తెలంగాణలో చిచ్చు పెట్టొద్దు

– ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
– దుబ్బాక అభ్యర్థి ప్రభాకర్‌ రెడ్డిపై దాడి హేయమైన చర్య
– ఇబ్రహీంపట్నంలో విలేకరుల సమావేశం
నవతెలంగాణ-రంగారెడ్డిప్రతినిధి
దుబ్బాక బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడి హేయమైన చర్యని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఖండించారు. పచ్చటి తెలంగాణలో చిచ్చు పెట్టొద్దన్నారు. ఇబ్రహీంపట్నం బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014, 2018 ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని చెప్పారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తుందన్నారు. తొమ్మిదిన్నర సంవత్సరాల్లో లేని అలజడులు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయన్నారు. మళ్లీ కాంగ్రెస్‌ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తుందని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులపై దాడి చేయడం కాంగ్రెస్‌ పార్టీకి తగదన్నారు. ఎన్నికల్లో తమ పార్టీ విధానాలు చెప్పుకొని ఓట్లు అడగాలి, కానీ హత్య రాజకీయాలు ప్రోత్సహించడం సరికాదన్నారు. అలజడులు సష్టిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి సంస్కతి లేదన్నారు. ప్రభాకర్‌ రెడ్డిపై జరిగిన దాడిని పీసీసీ అధ్యక్షులు, ఆ పార్టీ నాయకత్వం ఖండించాలని కోరారు. వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. దాడికి ప్రేరేపించిన వారిపై సైతం చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ హత్య రాజకీయాలు, దాడులను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. మరోవైపు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో క్యాడర్‌ లేని కాంగ్రెస్‌ పార్టీ, బీఆర్‌ఎస్‌ కార్యకర్తల వెంటపడుతుందన్నారు. ప్రలోభాలకు గురి చేస్తున్నారన్నారు. మరోసారి తమ కార్యకర్తల జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మండలంలోని మల్లాపూర్‌ గ్రామంలో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు మధు సుధన్‌రావు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నవతెలంగాణ-కొత్తూరు