తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగ, ఉపకులాల జీవితాలను అంధకారంలోకి నెట్టవద్దని మాదిగ విద్యార్థి ఉద్యమ నాయకుడు గడ్డం సంపత్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సుప్రీంకోర్టు నిర్ణయం తరువాత మొదటగా మన రాష్డ్రమే ఆర్డినెన్స్ తెచ్చి వర్గీకరణ అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. అయినప్పటికీ అలా ఆర్డినెన్స్ తేకుండా ఉద్యోగ ప్రకటనలు చేయడం వల్ల మాదిగలు, ఉపకులాల వారు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని వాపోయారు. మూడు దశాబ్దాల మాదిగల న్యాయమైన ఆకాంక్షను సుప్రీంకోర్టు గుర్తించిందని అలాగే ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయన్నారు. మన పక్క రాష్ట్రం కర్ణాటక, అలాగే హర్యానా ప్రభుత్వాలు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తున్నాయని తెలిపారు. తెలంగాణ లో మాత్రం మూడు నెలలు దాటినా వర్గీకరణ హామీ అమలు చేయకపోవడం బాదాకరమన్నారు. దయచేసి మాదిగల ఆవేదనను రాజకీయ కోణంలో చూడొద్దని తెలిపారు. ప్రస్తుతం జరగబోయే గ్రూపు -3, అలాగే గ్రూపు 2 లో ఆర్డినెన్స్ తెచ్చి వర్గీకరణ అమలు చేయాలన్నారు. లేకుంటే మాదిగలు, ఉపకులాల వారు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి తమకు సామాజిక భద్రత, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో న్యాయమైన వాటా కోసం వెంటనే వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రతీ గ్రామగ్రామాన మాదిగలను మరింత చైతన్యం చేస్తామన్నారు.