ఎర్రజెండా ఎత్త‌రా

 ఎర్రజెండా ఎత్త‌రా– అవినీతి రహిత ఎమ్మెల్యేగా గుర్తింపు
– ప్రజాగొంతుక, ఉద్యమకారుడు
– ఇప్పటికీ ఆయనకు సొంత ఇల్లు లేదు
– పొలంలోని చిన్న పాకలోనే నివాసం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

100కు పైగా వాహనాలు, ట్రాక్టర్లతో ఎర్రజెండాలు ఎగురవేస్తూ అభ్యర్థుల పర్యటన. ఇది కేరళ, పశ్చిమ బెంగాల్‌, త్రిపురలోని ఏ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల చిత్రం కాదు. రాజస్థాన్‌లోని బికనీర్‌ జిల్లాలో దుంగార్‌ఘర్‌ నియోజకవర్గంలోని పరిస్థితి. సీపీఐ(ఎం)కి చెందిన ఇద్దరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలలో ఒకరైన గిర్దారిలాల్‌ మహియా నియోజకవర్గం ఇది. ఆయన ప్రజాదరణ కలిగిన నేతగా ఎదిగారు. రైతు నేతగా అందరికి సుపరిచితులు. నిరాడంబర ఎమ్మెల్యేగా మంచి గుర్తింపు పొందారు.
దుంగార్‌ఘర్‌ సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థికి ప్రజాదరణ
మహియా ట్రాక్టర్స్‌ యాత్ర వివిధ ప్రాంతాలు, గ్రామాలు చుట్డుముడుతూ వ్యవసాయ గ్రామమైన దుల్చాసర్‌కి చేరింది. ట్రాక్టర్‌పై చేతులతో ఆయన అభివాదం చేస్తుండగా పక్కనే ఉన్న పలువురు కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. వెనుక భారీగా ట్రాక్టర్లు, వాహనాలున్నాయి.కానీ వీరి కాన్వారు పూర్తిగా గ్రామంలోకి ప్రవేశించలేకపోయింది.
గ్రామ ముఖద్వారం వద్ద ఆపి ఉంచిన జేసీబీని పైకి లేపిన భారీ క్రేన్‌పై పలువురు చిన్నారు లున్నారు. అయితే గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి మహియాకు అక్కడి ప్రజలు పూలవర్షంతో స్వాగతం పలికారు. దుల్చాసర్‌ గిర్దారిలాల్‌ మహియా స్వగ్రామం. తమ ప్రియతమ ఎమ్మెల్యే మరలా విజయం సాధించాలని కోరుతూ స్థానికులంతా తరలివచ్చారు. సర్పంచ్‌తో సహా గ్రామ నాయకుల పలకరింపుల తర్వాత అభ్యర్థి మహియా మాట్లాడారు. ఐదేండ్ల అభివృద్ధి కార్యక్రమాలను ఆయన వివరించినప్పుడు అక్కడి వారు ఫుల్‌ జోష్‌తో చప్పట్లు కొట్టారు.
అవినీతి రహిత ఎమ్మెల్యేగా గుర్తింపు
దుంగార్‌ఘర్‌లో తొలిసారిగా అవినీతి రహిత ఎమ్మెల్యేగా మహియా ఎన్నికయ్యారు. ఆయన సాత్వికుడు. ఈయనకు ఇప్పటికీ సొంత ఇల్లు లేదు. పొలంలోని చిన్న కొట్టం(పాక)లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఐదేండ్లపాటు ప్రజల మధ్య పనిచేశారు. మహియా ప్రజల అభ్యర్థి అని రైతు బికాం చంద్‌ అన్నారు.
2018లో మహియా 23,896 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కాంగ్రెస్‌కు చెందిన మంగళారం రెండో స్థానంలో, బీజేపీకి చెందిన తారాచంద్‌ సరస్వత్‌ మూడో స్థానంలో నిలిచారు. ఈసారి కూడా వీరే ప్రత్యర్థులు. మంగళారామ్‌ దుంగార్‌ఘర్‌ నుంచి మూడుసార్లు గెలిచారు. రెండుసార్లు ఓడిపోయారు. మహియా ప్రధాన ప్రత్యర్థి బీజేపీ సారస్వత్‌. ప్రీతీ శర్మ అనే తిరుగుబాటు అభ్యర్థి సారస్వత్‌కు ఇబ్బందులు సృష్టిస్తున్నారు. 2013లో దుంగార్‌ఘర్‌ నుంచి బీజేపీ టికెట్‌పై గెలిచిన కృష్ణ్ణరామ్‌ నారుకి కూడా ప్రీతీ శర్మ మద్దతు ఉంది.
ప్రజాగొంతుక, ఉద్యమకారుడు
ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంతో మహియా ప్రముఖంగా ఎదిగారు. ఆ సమయంలో ఆయనను జైలులో పెట్టి చిత్రహింసలు పెట్టారు. వేరుశనగ సాగుకు కేంద్రమైన దుంగార్‌ఘర్‌లో రైతుల కోసం అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. అక్కడి ప్రజలు వ్యవసాయానికి నీటి కోసం గొట్టపు బావులపై మాత్రమే ఆధారపడతారు. బోరుబావి నుంచి నీటిని తోడేందుకు కరెంటు అవసరం. విద్యుత్‌ కొరత తరచుగా వ్యవసాయాన్ని ప్రభావితం చేస్తుంది.
2016-17లో మహియా విద్యుత్‌ కోసం పెద్ద ఆందోళనకు నాయకత్వం వహించారు. నాటి వసుంధర రాజే ప్రభుత్వం ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నించింది. మహియాను కొట్టారు. జైల్లో కూడా పోరాటం కొనసాగింది. ప్రభుత్వం తలొగ్గింది. దుంగార్‌ఘర్‌లో రైతులకు సరిపడా కరెంటు వచ్చింది.
గత ఎన్నికల్లో రైతుల ఐక్య మద్దతు మహియాను భారీ మెజారిటీతో శాసనసభకు తీసుకొచ్చింది. సీపీఐ(ఎం) తొలిసారిగా 2008లో దుంగార్‌ఘర్‌లో పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో మహియాకు 7,646 ఓట్లు వచ్చాయి. 2013లో పోటీ చేయలేదు.ఈయన గతంలో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్‌ నుంచి కూడా ఒకసారి విజయం సాధించారు.