‘కండ్లు తిరిగి పడిపోకండ్రీ !’

ఆహా హా… పెద్దసారు ఏమి చెప్తిరి, ఏమి చెప్తిరి. తెలుగువారికి… పెరుగన్నంలో కొత్త ఆవకాయ నంజుకున్నంత మజాగా ఉంది మరి!
(ప్రధాని మోడీ ఓ తెలుగు పత్రికకు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వూ చూసి (నవ తెలంగాణ కాదు)
‘రోజుకు ఎన్నిగంటలు పని చేసానని లెక్కలేసుకునే వ్యక్తిని కాదు. కొన్ని అలవాట్లను చిన్నప్పుడే నేర్చుకుని ఇప్పటికీ పాటిస్తున్నాను. యోగా, ధ్యానం క్రమం తప్పకుండా చేస్తా. నా జీవితంలో పనికి, విశ్రాంతికి మధ్య తేడా లేదు. పనిలోనే విశ్రాంతి వెతుక్కోవడం అలవాటు చేసుకున్నాను’.
– పాపం సెమించుగాక, ఈ ఇసయం తెలియకనే మన దేశంలో కోట్లాదిమంది రైతులు కూలీలు పొద్దస్తమానం పనే చేస్తుంటారు. ప్చ్‌. ఏం చేద్దాం. ఎవరి ఆకలి వారిది. ఎవరి పని వారిది. ఎవరి విశ్రాంతి వారిది. అంతేగా… అంతేగా….
‘పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ధృడమైన హామీ ఇస్తున్నా. దాన్ని పూర్తి చేసే బాధ్యత నాదే. దాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇప్పటికే రూ.15 వేల కోట్లకు పైగా విడుదల చేసింది. సాంకేతిక సహాయమూ అందిస్తుంది.’
– అబ్బబ్బా ఇన్నాళ్లూ ఈ తెలుగోళ్లు ముఖ్ఖెంగా ఈ ఎ.పి. పెజలు ఎంత యాగీ చేసీ… ,చేసీ… పోలవరం నిర్మాణ పనులు అడ్డుకున్నారు. పదేండ్లంటే మాటలా… వాళ్ళకింకేం పని లేదా.. ? పొగరు కాకపోతే ఏంటిది? బొత్తిగా యవ్యారం తెల్వదు. అందుకే అలా తగలడ్డారు. గందుకే మళ్లీ మళ్లీ యాద్‌ చెయ్యాల్సి వస్తుంది. చెప్పి చెప్పి నా నోరు పడి పోతుందీ….
‘ఈ రోజు మనం మొబైళ్ల తయారీ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నాం. మన రక్షణ ఎగుమతులు రూ.21 వేల కోట్లు ఉంటాయి. సౌర విద్యుత్‌ పరికరాల తయారీలో ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా అవతరించ బోతున్నాం. ఇంత విస్తృత స్థాయిలో మనం చేస్తున్న పనులు కొత్త ఉద్యోగాలు సృష్టించవనుకుంటున్నారా?’
-వార్ని ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు. ఈ పదేండ్లల్లో 20 కోట్ల ఉద్యోగాలు మెరుపు వేగంతో వచ్చాయి. పోయాయి. యువతే చేతగాని దద్దమ్మ ల్లా వాటిని పట్టుకోకుండా లొల్లి చేస్తే ఎలా? అర చేతిలోబెల్లంపెట్టి మోచేతిని నాకమంటే నాకరేంటి?
‘వాస్తవానికి మేం రెండు రాష్ట్రాలకు చాలా మేలు చేసాం. 14, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం 2015-20 మధ్య కాలంలో రూ.22 వేల కోట్లు, 2020 – 26 మధ్య కాలంలో రూ.35 వేల కోట్లు గ్రాంటుఇచ్చాం. ఇవ్వబోతున్నాం. దీనికి తోడు వనరుల లోటు భర్తీ, 7 వెనుక బడిన జిల్లాల అభి వృద్ధి. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, విదేశీ సాయం. కింద చేపట్టిన ప్రాజెక్టుల రుణాలపై వడ్డీరాయితీ కోసం 2014-23 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌కు 35 వేల కోట్లకు పైగా విడుదల చేసాం’.
– ఇచ్చాం … ఇవ్వబోతున్నాం. వేల కోట్ల సాయం మాటల్లోని ఆంతర్యం లోగొట్టు పెరుమాళ్ళకే ఎరుక. అంతా శంకరాచార్యుని గజం మిధ్య పలాయపం మిధ్య.
ఈ ‘మండే ఎండల మాటలకు’ ఎవరికి వారు కండ్లు తిరిగి పడిపోకుండా జాగర్త పడాలి మరి. అంతేగా…. అంతేగా….
– శైలి, 9959745723