– అవినీతి సొమ్ముకక్కిస్తాం
– నల్లగొండకు కాదు.. ముందు అసెంబ్లీకి రండి
– కేసీఆర్ కుట్రలను ప్రజలందరూ తిప్పికొట్టాలి
– తెలంగాణ ప్రజలు, కవులు, కళాకారులు ఆలోచించాలి
– బీఆర్‌ఎస్ అవినీతికి బీజేపీ కొమ్ము కాస్తోంది
– ఆ రెండు పార్టీలు చీకటి మిత్రులు
– మేడిగడ్డలో నిర్మాణ లోపంతోపాటు, నిర్వహణ లోపం ఉంది : సీఎం రేవంత్
– మేడిగడ్డ లక్ష్మీ బ్యారెజీనుంచి బి. బసవపున్నయ్య
” కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవినీతిని కక్కిస్తాం. రెవెన్యూ యాక్ట్ ప్రకారం నిధులను రికవరీ చేస్తాం. మాజీ ముఖ్యమంత్రి నల్లగొండకు పోవడం కాదు… ముందు అసెంబ్లీకొచ్చి ప్రజల తరపున సమస్యలపై మాట్లాడాలి. సుద్దపూస లాగా బయట కూర్చొని మాట్లాడొద్దు” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… మాజీ సీఎం కేసీఆర్‌కు చురకలు అంటించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ, అన్నారం సుందిళ్ల, బ్యారేజీలపై బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలను తిప్పికొట్టాలని ఆయన ప్రజలకు, కవులు, కళాకారులకు పిలుపునిచ్చారు. కేసీఆర్ అవినీతికి కొమ్ముకాస్తున్న బీజేపీని సైతం తిరస్కరించాలని ఆయన కోరారు. ప్రాజెక్టుల్లో బీఆర్‌ఎస్ అవినితిపై బీజేపీ వైఖరి స్ఫష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఆ రెండు పార్టీలు చికటి మిత్రులని విమర్శించారు. కాళేశ్వరంపై సభలో చర్చకు రాకుండా నల్లగొండలో మీటింగ్ పెట్టడాన్ని ఖండించారు. సమస్యలపై చర్చించకుండా పార్లమెంట్ ఎన్నికల కోసం ఓట్లడుక్కోవడానికి ఆయన వెళ్లారని ఆరోపించారు. కాళేశ్వరం అవకతవకలపై బీఆర్‌ఎస్ పార్టీ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. కుర్చి వెతుక్కుంటూ నల్లగొండకు వెళ్లటం సిగ్గు చేటని అన్నారు. మేడిగడ్డ ఏ క్షణమైనా కుప్పకూలే ప్రమాదముందంటూ విజిలెన్స్, రిపోర్టు చెబుతుందనీ, అన్ని పాపాలకు కేసీఆర్ కారణమని విమర్శించారు. మంగళవారం శాసనసభ సమావేశాల వాయిదా అనంతరం సీఎం రేవంత్‌తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డ బ్యారేజిని సందర్శించారు. సీపీఐ, ఎంఐఎం, ఎమ్మెల్యేలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కె.నర్సిరెడ్డి ఇతరులు సైతం అక్కడికి సీఎంతో పాటు వెళ్లారు. ప్రభుత్వం ఆహ్వానించినప్పటికి బీఆర్‌ఎస్, బీజేపీ ఎమ్మెల్యెలు గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మేడిగడ్డను ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి కలియ తిరిగారు. బ్యారేజీకి సంబంధించి కుంగుబాటుకు గురయిన అన్ని పిల్లర్లు, స్పిల్‌వేలను పరిశీలించారు. అధికారులతో సందేహాలను నివృత్తి చేసుకున్నారు. బ్యారేజీపైనే కాకుండా కిందకూడా పరిస్థితిని అవగాహన చేసుకున్నారు. తీవ్రంగా దెబ్బతిన్న 19,20,21,22, పిల్లర్లను ఆసాంతం ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, మీడియాతో కలిపి అదే అంశంపై రెండు గంటల పాటు సమీక్ష నిర్వహించారు. ఇందులో సాగునీటి శాఖ ఇంజినీర్లు, మేడిగడ్డకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అధికారులు చెబుతున్న సందర్భంగా సీఎం మధ్యలో జోక్యం చేసుకుని అనేక విషయాలపై, వివరణ కోసం ప్రశ్నించారు. అలాగే విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్ సైతం తన విచారణ నివేదికను పవర్ పాయింట్ రూపంలో చెప్పారు. సీఎం, మంత్రులు, అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. అనంతరం సీఎం మాట్లాడుతూ నిర్మాణంలో నాణ్యతాలోపం ఉందని డ్యాం సేఫ్టీ అథారిటీ చెప్పినప్పటికీ, సమస్యను సరిదిద్దకుండా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ప్రాజెక్ట్ నిర్వహణకు ఏటా విద్యుత్ బిల్లులు రూ.10,500 కోట్లు ఇతర నిర్వహణ ఖర్చులు కలిపి ఏటా దాదాపు రూ. 25 వేల కోట్లు చెల్లించే పరిస్థితి ఏర్పడిందని ఆందోళనల వ్యక్తం చేశారు. సాంకేతిక నిపుణులతో చర్చించిన తర్వాత మేడిగడ్డ పునర్నిర్మాణంపై మా నిర్ణయం చెబుతామన్నారు. అక్రమాలకు బాద్యులపై విచారణ కొనసాగుతోందనీ, అవసరమైతే రెవెన్యూ యాక్ట్‌తో సొమ్ము రికవరీ చేస్తామని అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంచేయాలో సలహలు సూచలను ఇవ్వాలని కోరారు. తెలంగాణ కోసం చావు నోట్లో తల పెట్టిన ఆయన మేడిగడ్డపై సుద్దపూస లెక్కలు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు రూ. లక్ష కోట్లు ఖర్చు పెటారనీ, కొత్త ఆయకట్టు సృష్టించింది మాత్రం 90 వేల ఎకరాలేనని వివరించారు. కానీ కేసీఆర్ మాత్రం కోటి ఎకరాలకు నీరిచ్చామంటూ పచ్చి అబద్దాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాలు విరిగిన కేసీఆర్ కూత వేటు దూరంలో ఉన్న అసెంబ్లీకి రాకుండా నల్లగొండకు ఎలా వెళ్లారని ప్రశ్నించారు. ప్రజలకు అవగాహన లేదని ఆనుకుంటున్నారనీ, కానీ వాళ్లుగమనిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అవినీతికి దోపిడికి మేడిగడ్డ బలైందని విమర్శించారు. అసెంబ్లీలో పెట్టిన తీర్మాణం సరిగ్గా లేదని మామ అళ్లుండ్లు బయట చెప్పడం కాదనీ, సభకు వచ్చి తీర్మానాన్ని సవరించాలని సూచించారు.
ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలని అడుగుతున్నారనీ, ముందు ప్రజలు ఎన్నుకున్న సభకు వచ్చి మాట్లాడాలని సూచించారు. ఎన్నికల ముందే నీ సంగతి ప్రజలకు తెలిసుంటే ప్రతిపక్ష హౌదాకూడా వచ్చుండేది కాదని వ్యాఖ్యానించారు. సీపీఐ శాసన సభ పక్షనేత కూనంనేని సాంబశివ రావు మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజి పగుళ్లను.. తెలంగాణ ప్రజల గుండెల పగుళ్లని వ్యాఖ్యానించారు. దేశంలోనే కాళేశ్వరం పెద్ద కుంభకోణమని విమర్శించారు. మేడిగడ్డతో పాటు సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు ప్రమాదం పొంచి ఉన్నదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తతెత్తడానికి కాళేశ్వరం అవినీతేనని గుర్తు చేశారు. అవినీతీలో భాగస్వాములైనవారందరిని జైలులో పెట్టడంతో పాటు దుర్వినియోగమైన నిధులను రాబట్టాలని డిమాండ్ చేశారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం అవినీతీని వెలికి తీయడానికి ఎంత దూరమైనా పోతామని హెచ్చరించారు. అంచాలనాలను తక్కువగా రూపొందించి తర్వాత భారీగా పెంచుకున్నారని అధికారిక నివేదికలు స్ఫష్టం చేస్తున్నాయని అన్నారు.