నేటి పరిస్థితికి, దేశ పాలకులకు ‘ఇంట్లో ఈగల మోత.. వీధిలో పల్లకీల మోత…’ అన్న సామెత సరిగ్గా సరిపోతుంది. మాటలు కోటలు దాటుతాయి కానీ, చేతలు పేదోడికి ఒక పూట తిండి కూడా పెట్టడం లేదు. శనివారం ఢిల్లీలో జరిగిన 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సులో ‘ప్రపంచ ఆహార భద్రతకు పరిష్కారాలు చూపించేందుకు భారత్ సన్నద్ధమవుతోందని, ఇప్పటికే ఆహార మిగులు దేశంగా ఎదిగింది’ అని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. ప్రధాని చెప్పినట్టు ఉంటే దేశంలో పరిస్థితి ఇలా ఎందుకుండేది? ఒక వైపు దేశ పరిస్థితి ఆందోళనకరంగా తయారవుతున్నది. అయినా మేం గొప్పవాళ్లం, దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నామంటూ చెప్పుకోవడం సిగ్గుచేటు.
”తిండి కలిగితే కండ కలదోయ్ / కండ కలవాడేను మనిషోయ్” అని వందేండ్ల క్రితమే ఆహార భద్రత గురించి మహాకవి గురజాడ చాటి చెప్పాడు. సరైన తిండిలేక ఆకలి, అనారోగ్యాలతో వున్న సమాజంలో ”ఈసురోమని మనుషులుంటే/ దేశ మేగతి బాగుపడునోయ్” అని ఆయన నిలదీశాడు. మనిషి బతికి వుండాలంటే కనీస తిండి కావాలి. ఏదో ఆహారాన్ని పొందడమే కాదు, పౌష్టికాహారం పొందడం ప్రజల జీవిత హక్కు. ఆ హక్కు సక్రమంగా అమలు కావాలంటే పంటలు బాగా పండాలి. పండిన పంటలు ప్రజలకు అందుబాటులో వుండాలి. వాటిని కొనగలిగే స్థితి ప్రజలందరికీ వుండాలి. ఈ పురోగామి చక్రం సక్రమంగా నడిచేటట్టు చిత్తశుద్ధితో పాలకులు చూడాలి. కానీ, అలా జరగడం లేదు. అందుకే ప్రపంచంలో కొన్ని దేశాల ప్రజలు ఆహార భద్రతతో జీవిస్తుంటే, అనేక దేశాల్లో ఆకలి కేకలతో హౌరెత్తుతున్నారు. మన దేశంలో మాత్రం దిగుమతుల మీద ఆధారపడి జీవిస్తున్నాము. దీనికి బాధ్యత ఎవరిది?
ఆహారం కొనుగోలు సామర్థ్యం విషయంలో పొరుగు దేశాలైన పాకిస్థాన్, శ్రీలంక కంటే భారత్ వెనుకబడి ఉందని ప్రపంచ ఆహార భద్రత (జీఎఫ్‌ఎస్) సూచీ చెబుతోంది. ఆ నివేదిక ప్రకారం మొత్తంగా ఆహార భద్రతలో ఐర్లాండ్, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, అమెరికా అగ్రస్థానంలో ఉన్నాయి. గడిచిన దశాబ్ద కాలంలో ఆహార భద్రతలో భారత్ పెద్దగా పురోగతి సాధించలేదని నివేదిక వెల్లడించింది. ఈ విషయంలో పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్, చైనా..భారత్‌కంటే ఎంతో ముందున్నట్టు వివరించింది. ఈ వాస్తవాలను బుల్డోజ్ చేస్తూ 65 ఏండ్ల తర్వాత మన దేశంలో జరుగుతున్న అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సులో ప్రధాని పచ్చి అబద్ధాలు చెప్పారు.
దేశంలోని ఐదేండ్లలోపు చిన్నారుల్లో పెరుగుదల సమస్యలున్నాయి. 35.5శాతం పిల్లల్లో వయసుకు తగ్గ ఎదుగుదల లేదు. ఎత్తుకు తగిన బరువులేని వారు 19.3శాతం ఉంటే, అయిదేండ్లలోపు పిల్లల్లో 44.3శాతం మంది తక్కువ బరువుతో ఉన్నారని స్వయనా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖే గతంతోనే పార్లమెంట్‌కు తెలపింది. దేశంలోని మూడేండ్లలోపు పిల్లల్లో 47శాతం తక్కువ బరువుతో ఉన్నారని యునిసెఫ్ అంచనా. ప్రపంచంలోని మొత్తం పౌష్టికాహార లోపాలతో ఉన్న పిల్లల్లో మూడోవంతు మనదేశంలోనే ఉన్నారని యూనిసెఫ్ స్పష్టం చేస్తోంది. మరోవైపు ఆహార సంక్షోభం, ప్రపంచ ఆర్థిక మాంద్యం ఇప్పటికే తీవ్రంగా ఉన్న ఈ పౌష్టికాహార సమస్యను మరింత జటిలం చేశాయని నివేదికలు చెబుతున్నాయి. దేశంలోని పిల్లల్లో 80శాతం, మహిళల్లో 56శాతం రక్తహీనతతో బాధపడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తోంది. ఇతర అన్ని రంగాల్లో మాదిరిగానే పౌష్టికాహార లోపాల్లోనూ అణగారిన వర్గాల ప్రజలు తీవ్రస్థాయిలో వెనుకబడి ఉన్నారనేది వాస్తవం. ‘ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతాను’ అన్నట్టు దేశంలో పరిస్థితి ఇలా ఉంటే.. ప్రధాని ఆహార భద్రతకు పరిష్కారాలు ప్రపంచానికి నేర్పుతామని చెప్పడం హస్యాస్పదంగా ఉంది.
‘భారతీయ వ్యవసాయంలో ప్రత్యేకత గురించి, తమ దూర దృష్టి ప్రణాళికల గురించి చెప్పిన ప్రధాని, ఈ వైవిధ్యమే ప్రపంచ ఆరోగ్యభద్రతకు భారత్‌ను ఆశాకిరణంలా నిలుపుతోం దని తెలిపారు. 90శాతం మంది రైతులకు చాలా తక్కువ భూమే ఉంటుంది. చిన్నరైతులే దేశ ఆహార భద్రతకు అతిపెద్ద బలం’ అని కూడా వివరించారు. 70 దేశాల నుంచి వచ్చిన వెయ్యిమంది ప్రతినిధుల సదస్సులో ప్రధాని రైతులపై వల్లమాలిన ప్రేమను ఒలకపోశారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడానికి ఇదే మోడీ ప్రభుత్వం మూడు నల్ల వ్యవసాయ చట్టాలుతెస్తే… ఈ దేశ రైతులు వాటిని అడ్డుకునేందుకు ఉద్యమిస్తే ఎంత తీవ్రంగా అణిచివేసిందో ప్రపంచమంతా చూసింది. అలాంటి మోడీ వెన్నపూసిన మాటల విన్న అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తలు ‘వట్టిమాటలు చెప్పకోకోయి…’ అంటూ పాడుకున్నారు.