ఆర్టీసీలను బలిపశువులను చేయకండి!

కిలో మీటర్‌కు ఇప్పుడు వస్తున్న ఆదాయం కచ్చితంగా వస్తుందను కుంటే కూడా ప్రతి కి.మీ. రూ.10లు అదనంగా విద్యుత్‌ బస్‌లు నడిపే సంస్థలకు చెల్లించాల్సి వస్తుంది. మరి ఆ డబ్బులు ఎక్కడ నుండి వస్తాయి? అంటే అంతి మంగా ప్రజల నుండి టిక్కెట్లు ఛార్జీలు పెంచడం ద్వారా, సెస్‌ రూపంలో భారం మోపాల్సి వస్తుంది. కార్పొరేట్‌ విద్యుత్‌ బస్‌ల కంపెనీలు లాభాలు దండుకొంటాయి. ఆర్టీసీలో మూడవవంతు అద్దె బస్‌లుండగా, మరో మూడవ వంతు కార్పొరేట్‌ విద్యుత్‌ బస్‌లు అయి, టీఎస్‌ ఆర్టీసీ అన్న బోర్డు మిగిలి, మొత్తం ప్రయివేటు కార్పొరేట్ల పెత్తనం లోకి వెళ్ళే ప్రమాదం ఉంది.
కుక్కను చంపాలంటే ఆ కుక్కను పిచ్చికుక్క అని చిత్రీకరించితే చంపడం తేలికవుతుందన్న నానుడిలా కేంద్ర రవాణా మంత్రివర్యుల మాటలుండటం ఆందోళన కలిగిస్తున్నదని, పెట్టుబడిదారుల ప్రయోజనాలు పరిరక్షించడం కోసం ప్రజారవాణా సంస్థలైన ఆర్టీసీలను బలిపశువులను చేయవద్దని, ఆర్టీసీ కండక్టర్‌, డ్రైవర్‌లను దోషులుగా చిత్రీకరించ వద్దని కేంద్ర రవాణాశాఖ మంత్రివర్యులకు ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ లేఖ రాసింది. భారతదేశంలో డీజిల్‌ బస్‌ ఒక కిలో మీటర్‌ నడపడానికి రూ.115లు ఖర్చవుతున్నదని, అదే విద్యుత్‌ బస్‌లకు ఖరారైన టెండర్స్‌లో ఎసీ బస్‌లుకు అయితే కి.మీ.కు రూ.41లు, నాన్‌ ఎసి బస్‌ అయితే రూ.39లుకి ఫైనల్‌ అయ్యాయని, అందువల్ల సగానికి పైగా ఖర్చు తగ్గుతుందని, మే 24, 2023న ‘కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండి యన్‌ ఇండస్ట్రీ’ (సిఐఐ) వార్షిక సమావేశంలో కేంద్ర ఉపరితల రవాణాశాఖ మాత్యులు నితిన్‌ గడ్కరీ మాట్లాడటం అత్యంత దుర్మార్గం. ఇంతటితో ఊరుకోకుండా బస్‌లలో సింగిల్‌ డోర్‌ పద్ధతిని తీసుకొచ్చి, డిజిటల్‌ టిక్కెట్లు ఇవ్వడంతో పాటు, కండక్టర్లు చేస్తున్న ఫ్రాడ్‌ను తగ్గించడం కోసమేనని చెప్పి కండక్టర్ల ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు. వారిపై నిందారోపణ చేశారు. అలాగే విద్యుత్‌ బస్‌లకు ఎందుకు వెళ్తున్నామంటే డ్రైవర్లు చేస్తున్న డీజిల్‌ దొంగతనాన్ని నివారించడం కోసమేనని, మొత్తం డ్రైవర్లందరిని డీజిల్‌ దొంగలుగా చిత్రీకరించడం అత్యంత హేయమైనది.
విద్యుత్‌బస్‌లవల్ల నిజంగా ఆర్టీసీలు బతుకుతాయా?
మంత్రిగారి మాటల ప్రకారం డీజిల్‌ బస్‌ ఒక కి.మీ. రూ.115లు ఖర్చవుతుంది అంటున్నారు. ఇది నిజమే అయితే లీటర్‌ డీజిల్‌ ఒక కి.మీ. కూడా రాదు. మరి తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ లెక్కల ప్రకారం ఒక లీటర్‌ 5.24కి.మీ. నడుస్తున్నాయి. అంటే కి.మీ. నడపడానికి కేవలం రూ.18లు మాత్రమే డీజిల్‌కు ఖర్చవుతున్నది. ఈ నిజం మంత్రికి తెలిసే, ఆర్టీసీలపై అభాండాలు వేస్తున్నారు. ఏసీ విద్యుత్‌ బస్‌లు అయితే రూ.42లు, నాన్‌ ఏసీ అయితే రూ.39లకే టెండర్లు వచ్చాయి అని కేంద్ర మంత్రివర్యులు చెప్తున్నది నిజమేనా? టీఎస్‌ఆర్టీసీ త్వరలో 1010 విద్యుత్‌ బస్‌లు సమకూర్చుకొంటున్నదని, 500 బస్‌లు టెండర్‌ సుమారు రూ.55లు ఉండగా, మరో 500 బస్‌ల కోసం టెండర్‌ రూ.58ల వరకు ఉంటుందని, డబుల్‌ డక్కర్‌ బస్‌లకు దాదాపు రూ.80ల వరకు టెండర్స్‌ వేసినట్లు, ఈ టెండర్లన్నీ గ్రాస్‌ కాస్ట్‌ కాంటాక్ట్‌ (బస్‌ల కొనుగోలు బదులు బస్‌సేవలను కొనుగోలు చేస్తారు) పద్ధతిపైనే ఇచ్చినట్లు పత్రికలో వార్తలు వచ్చాయి. అంటే విద్యుత్‌ బస్‌ల కాంట్రాక్టు రూ.39లకే నడుపుతుంటే, వద్దు వద్దు మేము రూ.55ల నుండి రూ.58లు ఇస్తామని ఆర్టీసీ అధికారులు అంటున్నారా? కానే కాదు. దేశంలో వేసిన ఏ విద్యుత్‌ బస్‌ టెండర్‌ కూడా మంత్రిగారు చెప్పిన రేటుకు రాలేదు అన్నది నిజం. ఇప్పటి వరకు భారతదేశంలో ఫైనల్‌ అయిన టెండర్లులో కనీస మొత్తం రూ.52ల నుండి రూ.70ల వరకు ఉన్నాయి. ఇవన్నీ కూడా జీసీసీ పద్ధతి లోనే నడుస్తాయి. ప్రతి బస్‌కు 50లక్షల రూపాయల మేర సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ప్రయివేటు సంస్థలకే ఇస్తుంది. ఆ బస్‌లను కండక్టర్లతో నడపాలనుకుంటే ఆ ఖర్చు అదనంగా ఆర్టీసీలు భరించాల్సిందే. హైదరాబాద్‌లో రాబోయే విద్యుత్‌ బస్‌లకు కండక్టర్‌తో నడపాలంటే సుమారు రూ.62లు ఆర్టీసీ చెల్లించాల్సి వుంటుంది. అంటే మంత్రి చెబు తున్న దానికి, నిజానికి మధ్య కి.మీ.కు రూ.20పైనే తేడా ఉంటుంది. ఈ నిజాన్ని ఎందుకు కప్పిపుచ్చుతున్నారు?
భారాలు ప్రజలకు, లాభాలు కార్పొరేట్లకు
2022-23 ఆర్థిక సంవత్సరంలో కి.మీ. రూ.51లు ఆదాయం రాగా రూ.57లు ఖర్చయినట్లు ఆర్టీసి చెప్తున్నది. అంటే ప్రతి కి.మీ. రూ.6 ఎక్కువ ఖర్చవుతుందని, దానిని తగ్గించుకొనేందుకు కార్మికులపై భరించలేని పని భారాలు పెంచుతున్నారు. ప్రస్తుతం 44వేల మంది సంస్థలో ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. 2025లోపు 3500 విద్యుత్‌ బస్‌లు తెస్తామని ఆర్టీసీ అధికారులు ప్రకటిస్తున్నారు. ఇవన్నీ కూడా జీసీసీ పద్ధతి ప్రకారం నడుపుతారు అంటే ఇప్పుడు బస్‌ వెనుక ఆరుగురు పొందుతున్న ఉపాధిని కోల్పోతారు. (3500×6=21,000). ఇంత మంది కార్మికులు తగ్గిపోతే ఆర్టీసీ ఖర్చులు భారీగా తగ్గాలి కదా? మరి తగ్గుతాయా? ఇంతమంది ఉద్యోగాలు లేకుండాపోయిన తరువాత కూడా కండక్టర్‌తో నడపాలంటే రూ.60లపైనే విద్యుత్‌ బస్‌లకు చెల్లించాల్సి వస్తుంది. కిలో మీటర్‌కు ఇప్పుడు వస్తున్న ఆదాయం కచ్చితంగా వస్తుందను కుంటే కూడా ప్రతి కి.మీ. రూ.10లు అదనంగా విద్యుత్‌ బస్‌లు నడిపే సంస్థలకు చెల్లించాల్సి వస్తుంది. మరి ఆ డబ్బులు ఎక్కడ నుండి వస్తాయి? అంటే అంతి మంగా ప్రజల నుండి టిక్కెట్లు ఛార్జీలు పెంచడం ద్వారా, సెస్‌ రూపంలో భారం మోపాల్సి వస్తుంది. కార్పొరేట్‌ విద్యుత్‌ బస్‌ల కంపెనీలు లాభాలు దండుకొంటాయి. ఆర్టీసీలో మూడవవంతు అద్దె బస్‌లుండగా, మరో మూడవ వంతు కార్పొరేట్‌ విద్యుత్‌ బస్‌లు అయి, టీఎస్‌ ఆర్టీసీ అన్న బోర్డు మిగిలి, మొత్తం ప్రయివేటు కార్పొరేట్ల పెత్తనం లోకి వెళ్ళే ప్రమాదం ఉంది. ఈ విధంగా కార్పొరేట్లకు లాభాలు గ్యారెంటీ చేయడం కోసమే సిఐఐ మీటింగ్‌లో మంత్రి ఆర్టీసీలపై ఆ వ్యాఖ్యలు చేశారని అర్థం చేసుకోవాలి. ఈ విద్యుత్‌ బస్‌ల అనేక అంశాలపై స్పష్టత లేదు. పర్యావరణహితం మంచిదే. కానీ వీటి బ్యాటరీలను స్క్రాపింగ్‌ పాలసీ ఏమిటో మన దేశంలో లేదు. ఇప్పుడున్న బ్యాటరీల చార్జింగ్‌ 300కి.మీ. వరకు వస్తుంది. హైదరాబాద్‌ నుండి విజయవాడ వెళ్ళేలోపు సూర్యాపేటలో ఒకసారి చార్జింగ్‌ చేయవలసి వస్తుందని వార్తలు వచ్చాయి. విద్యుత్‌ బస్‌ల చార్జింగ్‌ కోసం కనీసం 3గంటలకు పైగా పడ్తుంది. ఫలితంగా ఆర్టీసీ బస్‌ల షెడ్యూలింగ్‌ మొత్తం కుప్పకూలుతుంది. అలాగే బ్యాటరీ స్వాపింగ్‌ కోసం ప్రయతిస్తే, ఆర్టీసీ చెల్లించాల్సిన డబ్బులు రెట్టింపయ్యే ప్రమాదం ఉంది. అందుకని ఈ విద్యుత్‌ బస్‌ల వల్ల కలుగు తాయని చెపుతున్న ప్రయోజనాలు, నష్టాలు, ఆర్టీసీల భవిష్యత్‌, ప్రజల పరిస్థితులపై మొత్తం లబ్ధిదారులందరి అభిప్రాయాలు తీసుకోవాలి. ఇప్పుడున్న రూపంలోనైనా ఆర్టీసీ సంస్థను కాపాడుకోవడానికి ప్రజలు, ప్రజాతంత్ర వాదులు, కార్మికులు ఐక్యంగా పోరాటం చేయాలి.
పుష్పా శ్రీనివాస్‌