‘విన్నపాలు వినవలె…’ అంటూ వాగ్గేయకారుడు అన్నమాచార్యులు ఏడుకొండల వాడిని వేడుకొన్నాడు. ‘ఎవడబ్బ సొమ్మనీ కులుకుతూ తిరిగేవు రామచంద్రా…’ అంటూ భక్త రామదాసు భద్రాద్రి రాముడిని ప్రశ్నించాడు. ఈ రెండింటిలో మొదటిది విజ్ఞాపన పత్రం లాంటిదైతే.. రెండోది ప్రశ్నించే తత్వం, పోరాట రూపం లాంటింది. ఇప్పుడు రాష్ట్రంలో ‘నెల బాలుడు’లాంటి రేవంత్ ప్రభుత్వం… కేంద్ర ప్రభుత్వం వద్దకు పోయింది. తెలంగాణకు ఆర్థిక సాయాలను అందించండి, గ్రాంట్లను, ఇతర బకాయిలను ఇప్పించండి, ఏపీతో ఉన్న ఆస్తుల విభజనకు సహకరించండి, అదనంగా ఐపీఎస్‌లను కేటాయించండంటూ ముఖ్యమంత్రి, సీనియర్ మంత్రులు మోడీ సర్కారుకు మొరపెట్టుకున్నారు. కేంద్ర మంత్రులకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలిచ్చి సత్కరించారు. ఆ తర్వాత వారి చేతుల్లో వినతిపత్రాలు, విజ్ఞాపన లతో కూడిన లేఖలను పెట్టారు. కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం.. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వంతో మైత్రీ, సయోధ్య నెరపటాన్ని మనం కచ్చితంగా తప్పు పట్టాల్సింది కాదు. ఆ రకంగా రేవంతుడు చొరవ చూపటాన్ని అభినందించాల్సిందే.
అయితే గత పదేండ్ల మోడీ సర్కారు రాష్ట్రాల పట్ల అనుసరిస్తున్న తీరును చూసిన వారెవరికైనా… ఈ విజ్ఞాపన, వినతిపత్రాలతో పని కాదన్న సంగతి ఇట్టే తెలిసిపోతుంది. దీన్ని మరింత లోతుగా పరిశీలిస్తే, గత బీఆర్‌ఎస్ సర్కారు సైతం రాష్ట్రానికి సంబంధించిన అనేకాంశాలపై పలు దఫాలుగా వందలకొద్దీ వినతులను సమర్పించింది. ఆనాటి సీఎం కేసీఆర్ సహా మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎంపీలు అనేకసార్లు మోడీ సాబ్‌ను కలిసి మొరపెట్టుకున్నారు. అయినా ‘…..పై వానపడ్డ’ చందాన కేంద్రం మన మాటలను లెక్కజేస్తే కదా..? విభజన హామీలను తుంగలో తొక్కటం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మిస్తామన్న వాగ్దానాన్ని గాలికొదిలేయటం, ఒక్క నవోదయ పాఠశాలనూ ఇవ్వకుండా మొండి చేయి చూపటం, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై రిక్త హస్తమివ్వటం, నిటి అయోగ్ చెప్పినా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నయా పైసా ఇవ్వకపోవటం, తెలంగాణ లోని సాగునీటి ప్రాజెక్టుల్లో ఒక్కటంటే ఒక్కదానికి కూడా జాతీయ హోదా ఇవ్వకుండా చోద్యం చూడటం లాంటివి ఎన్నో ఎన్నెన్నో. ఈ ఉదాహరణలు చాలు కేంద్రం తెలంగాణ పట్ల ఎంత వివక్ష చూపిందో చెప్పటానికి.
ఇక నిధుల విషయంలో మోడీ సర్కార్ మనకు చేసిన మోసం అంతా ఇంతా కాదు. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన రూ.1,350 కోట్లను (2019 నుంచి 2023 వరకు రావాల్సినవి) కేంద్రం పెండింగ్‌లో ఉంచారు. నిటి అయోగ్ సిఫారసుల ప్రకారం మిషన్ భగీరథ నిర్వహణ కోసం తెలంగాణకు విడుదల చేయాల్సిన రూ.19,205 కోట్లకు బీజేపీ ప్రభుత్వం ఎగనామం పెట్టటం దారుణం. 2014-15లో రాష్ట్రానికి రావాల్సిన రూ.495 కోట్ల సీఎస్‌ఎస్ (కేంద్ర ప్రాయోజిత పథకాలు) నిధులను ఏపీకి బదలాయించిన మోడీ సర్కార్… వాటిని ఇప్పటి వరకూ తిరిగివ్వలేదు. రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.1,093 కోట్ల సాయం చేయాలంటూ పదిహేనో ఆర్థిక సంఘం చేసిన సిఫారసును కేంద్రం పెడచెవిన పెట్టటం గమనార్హం. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో ఇవ్వాల్సిన ఆర్థిక సాయాలకు భారీగా కోతలేయటం తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న వివక్షకు పరాకాష్ట.
ఈ రకంగా మోడీ సర్కార్… మన రాష్ట్రం పట్ల దారుణమైన వివక్షను, అంతకుమించిన నిర్లక్ష్యాన్ని చూపుతున్న తరుణంలో రేవంత్ సర్కార్, కేవలం వినతిపత్రాలతో సరిపుచ్చితే సమస్య పరిష్కారం కాదు.. కాజాలదు. బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని ముల్లుగర్రతో పొడిచినప్పుడే అది ముందుకు కదులుతుందనే వాస్తవాన్ని మనం మరువరాదు. ప్రజల్ని, ప్రతిపక్షాల్ని కలుపు కునే చేసే పోరాటాలు, ఆందోళనలే అలాంటి ముల్లుగర్రలు. గతంతో రాష్ట్రాల హక్కులు, సమాఖ్య వ్యవస్థ బలోపేతం తదితరాంశాలపై కేరళ సీఎం పినరయి విజయన్, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బైఠాయించి మోడీ సర్కార్ వైఖరిని దునుమాడిన సంగతి మనకెరుకే. అందుకే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అదే రకమైన పోరుబాటను ఎంచుకోవాలి. అప్పుడే పన్నులు, నిధుల్లో మన వాటా మనకు దక్కుతుందనే విషయాన్ని గుర్తెరగాలి.