కురుమూర్తి’పై ఒట్టు పెట్టి మాట తప్పిండు

Don't put scum on Kurumurthi– సగం మందికి రుణమాఫీ కాలేదు :మాజీమంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-మదనాపురం
హామీల అమలుపై కురుమూర్తి దేవునిపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఒట్టు పెట్టి మాట తప్పారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కురుమూర్తి ఆలయాన్ని సందర్శించిన ఆయన స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం మదనాపురం మండలం నెల్విడి గ్రామ సమీపంలోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో హామీలిచ్చి ఆ తర్వాత పథకాలను ఎక్కడికక్కడా పడుకోబెట్టిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదని విమర్శించారు. వరంగల్‌ మీటింగ్‌లో తిట్ల పురాణం తప్ప ప్రజలకు, మహిళలకు పనికొచ్చే ఒక్కమాట కూడా సీఎం రేవంత్‌రెడ్డి చెప్పలేదని అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులతో విసిగిపోయిన రైతులు సన్నవడ్లను కూడా బయట వ్యాపారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. రైతులు తల్లడిల్లుతూ ఉంటే వడ్లను ఎండబెట్టి.. క్లీన్‌ చేయాలని చెప్పడం సరికాదన్నారు. సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్‌కు.. రేవంత్‌రెడ్డికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, ఎమ్మెల్సీ నవీన్‌ కుమార్‌ రెడ్డి, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌, కార్పొరేషన్‌ మాజీ చైర్మెన్‌ వేద రజిని సాయిచంద్‌, మాజీ జెడ్పీటీసీ కృష్ణయ్య యాదవ్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మెన్‌ శ్రావణ్‌ కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు.