నిద్ర‌ పట్టక…

Don't sleep...ఈరోజు సెలవు కదా హాయిగా నాష్టా చేసి ఒకసారి, భోజనం చేసి ఒకసారి నిద్రపోవచ్చు కదా అని బాగా నిద్రపట్టే మనిషి మిత్రులకు సలహా ఇవ్వొచ్చు. ఉదయంపూట నిద్రపోతే రాత్రి జాగరణ చేయవలసిందే అని ఒక జీవి, నాకు రాత్రి నిద్ర పడితే చాలు ఉదయం నిద్ర గురించిన ఆశలేదు అని ఒకజీవి, నిద్రదేముంది మేలుకుంటేనే కదా ప్రపంచంలో ఏమి జరుగుతుందో తెలిసేది ఏ టీవీలోనో, సెల్లులోనో మొహం పెడితే లోక జ్ఞానమైనా వస్తుంది అని ఇంకో జీవి చెప్పొచ్చు. నిద్ర పట్టడం అన్నది ఒక వరమని, పట్టకుంటే అది శాపమని ఇంకొకరు చెప్పొచ్చు. నిద్ర పట్టడం పట్టకపోవడం శరీర శ్రమ మీదే ఆధారపడి ఉంటాయని ఇంకొకరు అనొచ్చు. ఏదేమైనా అలా నిద్ర పట్టడానికి, పట్టకపోవడానికి శారీరక, మానసిక, సామాజిక, రాజకీయ, సాంకేతిక కారణాలనేకం ఉంటాయన్నది అసలు విషయం.
శివ్‌ ఖేరా రాసిన ఓ పుస్తకంలో ఓ తాగుబోతుకు ఇద్దరు కొడుకులుంటారు. వాళ్లలో ఒకడు క్రమశిక్షణతో, శ్రమతో మంచి వ్యాపారవేత్తగా మారతాడు. ఇంకొకడు ఏమీ చేయక పచ్చి తాగుబోతుగా మారతాడు. ఇద్దరినీ ఇంటర్వ్యూ చేస్తాడు రచయిత. ఈ.వీ.ఎంలలో వచ్చిన ఫలితంలా ఇద్దరూ ఒకే సమాధానం చెబుతారు. అదేమంటే దానికి కారణం నా తండ్రి అని. తండ్రిని చూసి విసిగిపోయి ఒకరు, అలా తయారు కాకూడదని ఒకరు వేరువేరుగా తయారయ్యారన్నమాట. అలాగే నిద్ర గురించి కూడా ఎవరెన్ని చెప్పినా, ఔనన్నా, కాదన్నా అది మనిషి మనిషికీ వేరువేరుగా ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.
ముఖ్యమంత్రినైనప్పటినుండి నిద్రపట్టడం లేదని ఓ నాయకమ్మణ్యుడు వాపోవచ్చు. ఆ పదవి పోయినప్పటినుండి ఎక్కువగా మేలుకొనే ఉన్నానని ఇంకో ప్ర(వృ)ద్ధుడు అనొచ్చు. వాళ్లిద్దరూ ఒకరు అయినందుకు, ఒకరు కానందుకు నిద్రపోక పోతే ఇకొకరు తానెప్పుడైతాడా ముఖ్యమంత్రిగా అని ఆలోచిస్తూ నిద్ర పట్టక దొర్లుతూ ఉండొచ్చు. కొన్ని చోట్ల అల్లుళ్లు ముఖ్యమంత్రులవుతున్నారు ఇక్కడెందుకో కొడుకులే ఆ కుర్చీ దగ్గరికి పోతున్నారని కూడా ఇంకో గిరీష్‌ అనుకోవచ్చు. ఇంకో చోట అటు అల్లుడు, కొడుకు కాక మరో ఉప ముఖ్యమంత్రి ఉంటే తాను తరువాత ముఖ్యమంత్రినని అతనూ అనుకోవచ్చు. ఏదేమైనా ముఖ్యమంత్రి కుర్చీ బాగుం టుంది కాని దానివెనుక ఇన్ని నిద్రలేని రాత్రులు, నిద్ర రాని మనుషులు ఉంటారన్నదే అసలు విషయం. మామూలుగా వ్యాపార లావాదేవీలు రాసేవాళ్లు ఒక డెబిట్టుకు ఒక క్రెడిట్టు ఉంటుందని చెబితే ఇక్కడ అలాంటివి ఎన్నో ఉంటాయి. ఒకరికి వచ్చే కూడిక ఇంకొకరికి తీసివేతగా కూడా ఉంటుందని అనుకోవచ్చు.
అయినా బాసూ, నిద్రాహారాల గురించి ఆలోచిస్తే ఈ రాజకీయాల్లో అస్సలుండలేవు. కాబట్టి వచ్చే ముందే నిర్ణయించుకో నీకేది కావాలో, అంతే కాని అవ్వా బువ్వా రెండూ నీకే కావాలంటె మాత్రం కుదరదు అని ఓ సీనియర్‌ నాయకుడు ఛోటా నాయకుడితో చెప్పే ఉంటారు. వ్యాపారంలో కాని, రాజకీయాల్లో కాని ఎప్పుడూ ఎత్తుగడలతో పోతుండాలి అంతే కాని ఎంతకు నిద్రపోయానా, ఎంతకు లేచానా అని చూసుకున్నావనుకో నీవు పైకెదగడం కష్టం అని ఆ సీనియర్‌ చెబుతుంటే గోడ మీదున్న కురుక్షేత్రం బొమ్మలో కృష్ణుడు అర్జునుడికి గీత చెబుతున్నట్టుగా ఫీలవుతాడు ఛోటా నాయకుడు. ఇంకా ఇప్పుడేం చూశావ్‌, రానురాను ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి, ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి దూకడం కూడా అలవాటవుతుంది. నీకెలా అవసరాలున్నాయో వారికీ ఉంటాయన్నది సూత్రం అంటాడు సీనియర్‌. అంటే ఈ పార్టీలో ఉన్నప్పుడు నిద్ర రాకపోతే ఆ పార్టీలోకి ఇలా మారుతూ ఉండాలన్నమాట అంటాడు. నీకు నిద్ర మీద ధ్యాస తప్ప పైపైకి ఎదిగిపోవాలని లేదా? ఉంటే నా మాట విను అని సీనియర్‌ గట్టిగా గడ్డిపెడతాడు.
నీకు నిద్రపట్టిందా లేదా అన్నది కాదు అవతలివాడికి నిద్రలేకుండా చేయడం ముఖ్యం అని ఇంకోచోట రెండో కృష్ణుడు తనతో ఉన్న రెండో అర్జునుడికి బోధ చేస్తూ ఉంటాడు. వాడికీ నిద్రలేక, నాకూ లేక ఇంక సాధించిందేమిటి? నేను ఇప్పుడే ఈ రాజకీయాల్లోనుండి శాశ్వతంగా విరమించుకుంటాను అని తాతలు, తండ్రులు, సోదరులు అనే డైలాగులా చిన్న నాయకుడు భయపడితే, బాధపడితే ఇదంతా మామూలే. వాళ్లకి నిద్రలేకుండా చేసింది, మనందరికీ నిద్రలేకుండా చేసింది నేనే, రెండు పార్టీలకు ఐడియాలు ఇచ్చేది నేనే, మాటలు రాసిచ్చేది నేనే, నా ఫీజు నాకొస్తే అదే పదివేలు అన్న మాటతో నిద్రనే కాదు మెలకువ కూడా దూరమవుతుంది ఛోటా నాయకుడికి. ఇన్ని చేసీ సాధించే ఫలితమేమిటి గురువుగారూ అన్న ప్రశ్నకు సమాధానంగా మన పరపతి పెరగడం కన్న వేరే ఫలితమేం కావాలి శిష్యా అనేసరికి ఇక్కడ కూడా కురుక్షేత్రంలోని గీత ఫొటో చూసుకుంటాడు విద్యార్ధి.
నా చివరి ప్రశ్న గురువా ఎంతసేపూ ఆ పార్టీ ఈ పార్టీ, ఆ నాయకుడు, ఈ నాయకుడు అన్న మాటలే వినిపిస్తున్నాయి కాని ప్రజలు సరిగా తింటున్నారా, సరిగా నిద్రపోతున్నారా, వాళ్ల ఆరోగ్యాలెలా ఉన్నాయి అన్నది కదా ఈ అధికారాలు, పార్టీల కర్తవ్యం అనేసరికి బడా నాయకుడు అదో మాదిరి మొహం పెట్టి… చట్టబద్దం, న్యాయబద్దం అన్న మాటలు విన్నావా అనడుగుతాడు సీనియర్‌. విన్నానంటాడు శిష్య. ఇక్కడ న్యాయబద్దంగా పనులు చేస్తూ కూచుంటే బిర్లా మందిర్‌ దగ్గరో, యాదగిరిగుట్ట గుడిదగ్గరో భిక్షకోసం కూచొని ఉంటారే అలా మారాలి నువ్వు. ఇక్కడ రాజకీయాల్లో చట్టబద్దంగా ఉన్నమా లేదా అన్నదే ముఖ్యం. ఇక్కడ నీవు న్యాయబద్దంగా ఉన్నావనుకో, తిండిలేక, సౌకర్యాలు లేక, నిద్రలేక ఎండిపోతావు. చట్టబద్దంగా ఉంటే అన్ని సుఖాలూ ఉంటాయి, ఎప్పుడూ కాకపోయినా అప్పుడప్పుడూ నిద్రపోవచ్చు తెలుసుకో. ఇప్పుడు గురువు తల చుట్టూ దేవుళ్ల పటాల్లో ఉన్నట్టు వెలుగేదో కనిపిస్తుంది శిష్యుడికి. ఆ వెలుగుని చూసి అమాంతం నిద్రలోకి జారుకుంటాడు.

– జంధ్యాల రఘుబాబు
9849753298