– ఆరు గ్యారంటీల అమలుపై చిత్తశుద్ధితో ఉన్నాం
– ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టిన వారిపై చర్యలు తప్పవు
– సీఎం హామీ మేరకు రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు : మీడియాతో చిట్‌చాట్.. ప్రజాపాలన సభల్లో సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
‘గత ప్రభుత్వంలోని కొందరు మంత్రులు రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందనే సాకుతో ఆరు గ్యారంటీలను ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నామని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ముందు మెరుగులు, వెనుక డొల్ల లాంటి అభివృద్ధి చేసిన వాళ్లకు ఇంతకంటే మంచి ఆలోచనలు రావు.. కుంటి సాకులతో ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్కదాన్నీ ఆపం.. ప్రభుత్వానికి ఇందిరమ్మ అభయహస్తంపై చిత్తశుద్ధి ఉంది’ అని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. ఖమ్మంలోని ఎస్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. అనంతరం ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి మార్కెట్, జేఎన్‌టీయూ కళాశాల స్థల పరిశీలన, తిరుమలాయపాలెం, మంగళగూడెం, నేలకొండపల్లి మండలం మంగాపురం తండా, కూసుమంచి మండలం ముత్యాలగూడెం ప్రజాపాలన సభల్లో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్దులపల్లి మార్కెట్ నిర్మాణ స్థలంలో ఒకప్పుడు పెద్దపెద్ద మట్టిగుట్టలు ఉండేవని, ఆ మట్టిని అమ్ముకుని రూ.కోట్లు సంపాదించుకుని, చివరకు మార్కెట్ నిర్మాణానికి మట్టిలేని పరిస్థితికి తీసుకొచ్చారన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులతో సహా అర్హులందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇస్తామని మంత్రి పునరుద్ఘాటించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతామన్నారు. ప్రతి గ్రామంలో అర్హులకు ఆరు గ్యారెంటీలు ఇచ్చి తీరుతామని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ ఇసుక మీద ర్యాంప్ వేసి కట్టారు. అప్‌స్టిక్, డౌన్‌స్టిక్ కటాప్ నిర్మాణం లోపభూయిష్టంగా జరిగిందని తెలిపారు. 180 టీఎంసీలకు గాను లిఫ్ట్ చేసింది 50 టీఎంసీలేనన్నారు. గత ప్రభుత్వం పోతుపోతు విద్యుత్ అందించలేని పరిస్థితి కల్పించిందని తెలిపారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి విద్యుత్‌పై అప్రమత్తమయ్యారని చెప్పారు. కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, ఎంపీపీ మంగీలాల్, కాంగ్రెస్ నాయకులు రాయల నాగేశ్వరరావు, మద్ది శ్రీనివాసరెడ్డి, రామసహాయం నరేష్‌రెడ్డి, డాక్టర్ కోట రాంబాబు, కొప్పుల అశోక్, చావా శివరామకృష్ణ, ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల సమస్యలపై..
జర్నలిస్టుల సమస్యలను వివిధ యూనియన్ల నాయకులు, పలువురు జర్నలిస్టులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. రాంనారాయణ, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఏ. ఆదినారాయణ, టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను తక్షణం పరిష్కరించాలని కోరారు. 23 ఎకరాల స్థలాన్ని కేటాయించి సన్మానాలు, సత్కారాలు పొందినా జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్య అపరిష్కృతంగానే ఉందన్నారు. వీటిపై మంత్రి స్పందిస్తూ.. సీఎం మామీ మేరకు త్వరలో రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తామని తెలిపారు.