– మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిన సైన్స్ పార్కు
– చెట్ల పొదలు, చెత్తాచెదారంలో కలిసిపోయిన పరికరాలు
– రూ.35లక్షల నిధులు వృథా..పట్టించుకోని అధికారులు
– తాజాగా మరో రూ.23లక్షలతో పునర్నిర్మాణం
విద్యార్థులకు విజ్ఞానం నేర్పిస్తుందని ఏర్పాటుచేసిన సైన్స్ పార్కు ఎందుకు పనికిరాకుండా పోయింది. అధికారుల పట్టింపులేమి కారణంగా ఏర్పాటుచేసిన ఈ విజ్ఞాన పార్కు మూన్నెళ్లలోనే అతీగతి లేకుండా పోయింది. ఈ పార్కు నిర్మాణం కోసం వెచ్చించిన రూ.35లక్షల నిధులు వృధాపాలయ్యాయి. సైన్స్ పరికరాలు తుప్పుపట్టి..పిచ్చిమొక్కలు..చెత్తాచెదారం మద్య కలిసిపోయి పనికిరాకుండా పోయాయి. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఐదేండ్లు గడుస్తున్నా అలాగే ఉండిపోయింది. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఏర్పాటుచేసిన ఈ సైన్స్ పార్కు నిర్మాణం పట్ల తొలుత అందరిలోనూ ఆసక్తి ఉండేది. కానీ నిర్మాణ లోపాలతో పాటు నిర్వహణ మరిచిపోవడంతో ఈ పార్కు దిక్కుతోచని పరిస్థితిలో ఉండిపోయింది. సైన్స్ పరికరాలను స్వయంగా చూస్తూ విజ్ఞానం నేర్చుకుందామని భావించిన విద్యార్థులకు అందని ద్రాక్షగానే మారింది. రూ.35లక్షలతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన సైన్స్ పార్కు దుస్థితిపై ప్రత్యేక కథనం..
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సైన్స్ పార్కును ఏర్పాటుచేశారు. జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల 26గుంటల విశాలమైన ఖాళీ స్థలం ఉండటంతో ఇక్కడ విజ్ఞాన పార్కు ఏర్పాటుచేస్తే బాగుంటుందని అప్పటి జిల్లా కలెక్టర్ దివ్యాదేవరాజన్ భావించారు. కర్ణాటకలోని బెంగళూరులో డా.ఏపీజే అబ్దుల్‌కలాం పేరిట విజ్ఞాన పార్కు ఉండటంతో ..ఆ పార్కు మాదిరిగానే ఇక్కడ కూడా ఆయన పేరిటనే సైన్స్ పార్కును ప్రారంభించారు. భౌతిక, రసాయన శాస్త్రానికి సంబంధించిన పరికరాలను కేవలం పుస్తకాల్లో చదవడమే కాకుండా ద్రవ్యరాశి జడత్వం, గ్రహాల గమనాన్ని తెలిపే పరికరం, పిరియాడిక్ టేబుల్, పెరిస్కోప్ వంటి పరికరాల పనితీరును స్వయంగా తెలుసుకునేందుకు వీలుగా 2018-19 ఏడాదిలో రూ.35లక్షల ప్రత్యేక నిధులతో ఈ పార్కును ఏర్పాటుచేశారు. జిల్లా విద్యామౌళిక వసతుల అభివృద్ధి సంస్థ(టీజీఈడబ్ల్యూఐడీసీ) ఆధ్వర్యంలో పనులను ఓ గుత్తేదారుకు అప్పగించారు. కొన్ని రోడ్లు వేయడంతో పాటు వివిధ రకాల సైన్స్ పరికరాలను బిగించారు. ప్రారంభించిన తొలినాళ్లలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు స్వయంగా ఇక్కడకు వచ్చి ఈ పార్కును సందర్శించి విషయాలు తెలుసుకునేవారు.
మూన్నేళ్లలోనే మూతపడింది..!
ఈ పార్కులో మిగితా అభివృద్ధి పనులు చేపట్టకపోవడం.. వర్షాకాలంలో బురదమయంగా మారడంతో పిచ్చిమొక్కలు వెలిశాయి. కొన్ని రోజుల పాటు పర్యవేక్షించిన అధికారులు, సిబ్బంది అనంతరం ఈ పార్కు నిర్వహణను పూర్తిగా వదిలేశారు. నాటిన చెట్లతో పాటు బిగించిన పరికరాలకు కూడా రక్షణ లేకపోవడంతో పనికిరాకుండా పోయాయి. ప్రస్తుతం ఈ పార్కులో పిచ్చిమొక్కలు ఏపుగా పెరగడం, చెత్తాచెదారం పోగుకావడంతో దుర్గంధం వెదజల్లుతోంది. అటువైపు ఎవరూ కన్నెత్తిచూడకపోవడంతో అసలు ఇక్కడ పార్కు ఉందా..? అనే అనుమానం కలిగేలా మారింది. విద్యాశాఖ అధికారులతో పాటు ఇంజనీరింగ్ అధికారులు సైతం దీనిపై దృష్టిసారించకపోవడం మూలంగా ఈ పార్కు అధ్వాన్న స్థితిలో ఉండిపోయింది.
మరో రూ.23లక్షలతో పునర్నిర్మాణం..?
విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచే ఈ పార్కు పరిస్థితిపై ప్రస్తుత జిల్లా కలెక్టర్ దృష్టిసారించినట్లు తెలిసింది. మళ్లీ ఈ పార్కు పునర్నిర్మాణం చేపట్టాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. ఇందుకు అయ్యే వ్యయం వివరాలను సమర్పించాలని ఆదేశించడంతో అధికారులు వివిధ పనులు చేపట్టేందుకు రూ.23లక్షల వరకు ఖర్చు అవుతుందని ప్రతిపాధనలు సమర్పించారు. పిచ్చిమొక్కల తొలగింపు..భూమి లెవలింగ్‌తో పాటు సీసీ రోడ్ల నిర్మాణం తదితర వాటిని చేపట్టాల్సి ఉంటుందని అధికారులు నివేదిక అందించినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ పార్కు మళ్లీ అందుబాటులోకి తీసుకొస్తే విద్యార్థులకు విజ్ఞానం అందించడమే కాకుండా జిల్లాకు కూడా మంచి పేరు వస్తుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.