అపరిచితులను నమ్మవద్దు

Don't trust strangersనేలకొండపల్లి అనే గ్రామంలో అమూల్య అనే విద్యార్థిని ఉండేది. ఆ ఊరిలో ఐదవ తరగతి వరకే ఉన్నది. పై తరగతి చదవాలంటే మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లాలి. అందువల్ల అమూల్య తల్లి ”చదివిన వరకు చాలు. మన ఊరి నుంచి కోదాడకు రవాణా సౌకర్యం కూడా లేదు. కాలినడకన ప్రతిరోజూ వెళ్లి రావాలంటే చాలా ఇబ్బంది. ఐనా నిన్ను చదివించే స్థోమత లేదు. నాతోపాటు తోట పనికి, కూలీ పనికి వస్తే ఇంటి ఖర్చులతో పాటు, నీ పెళ్లి ఖర్చులకు కూడా డబ్బులు జమ అవుతాయి” అని అన్నది. కానీ అమూల్యకు బాగా చదువుకోవాలని కోరికగా ఉండేది.
తల్లి మాటను కాదనలేక కొన్ని రోజులపాటు తల్లితో కలిసి కూలీ పనికి వెళ్లింది అమూల్య. కూలీకి సంబంధించిన డబ్బుల లెక్కలన్నీ అమూల్యనే చేయడం చూసి తోటి పనివాళ్లు ఆశ్చర్యపోయేవారు. ”ఎందుకే! రమణమ్మ… ఇంత తెలివిగల పిల్లను బడికి పంపించక, నీతో పాటు కూలీ పనికి తీసుకొస్తున్నావు? నీలాగే జీవితాంతం కూలీ పనులు చేస్తూ జీవించాలా? నా మాట విని నీ బిడ్డను రేపటి నుంచి బడికి పంపించు. మంచి ఉద్యోగం సాధించి పెడుతుంది. దాని జీవితం ఆగం చేయకు” అని తోటి కూలీ రమణమ్మతో అన్నది.
ఇంటికి వెళ్లిన రమణమ్మ భోజనం చేసింది. నిద్రపోయే ముందు రమణమ్మ తన స్నేహితులు చెప్పిన మాటల గురించి బాగా ఆలోచించింది. ”అవును నా బిడ్డ నిజంగా చదువుల తల్లి. నాలాగే కూలీ పనులు చేసుకొని బతకాల్సి వస్తుంది. కాబట్టి రేపటి నుంచి పాఠశాలకు పంపుతాను”అని నిర్ణయించుకుంది. మరుసటి రోజే ”అమ్మా! అమూల్య.. బడికి రెడీ అవ్వు. ఈరోజు నిన్ను బడిలో చేర్పించి వస్తాను” అని అన్నది రమణమ్మ.
ఆ మాటలు వినగానే అమూల్య ఎగిరి గంతులేసింది. చకచకా పాఠశాలకు రెడీ అయ్యింది. తల్లితో కలిసి వెళ్లి, ఉన్నత పాఠశాలలో చేరింది.
ప్రతిరోజూ క్రమం తప్పకుండా స్నేహితులతో కలిసి పాఠశాలకు వెళ్లేది. అమూల్య చాలా చురుకైనది, తెలివిగలది. టీచర్లు చెప్పే పాఠాలను వెంటనే నేర్చుకునేది. కొద్ది రోజుల్లోనే ఉపాధ్యాయుల దష్టిలో మంచి విద్యార్థినిగా పేరు కూడా తెచ్చుకుంది. బిడ్డ చదువును గురించి పాఠశాల ఉపాధ్యాయులు రమణమ్మకు చెబుతుంటే విని పొంగిపోయేది. ”నా బిడ్డ పెద్ద ఆఫీసర్‌ అవుతుంది” అని కలలు కనేది రమణమ్మ.
ఒకరోజు తన స్నేహితురాళ్లతో కలిసి పాఠశాలకు నడుచుకుంటూ వెళుతుండగా పాఠశాల గేటుకు కొంచెం దూరంగా కొంతమంది ఆకతాయిలు బైక్‌ వేసుకుని నిలబడి ఉన్నారు. వాళ్లను చూసి మొదట భయపడింది అమూల్య. తర్వాత ధైర్యం తెచ్చుకొని ”ఏమీ కాదు. పదండి వెళ్దాం” అని తన స్నేహితులలో కూడా ధైర్యాన్ని నింపింది. అందరూ ముందుకు కదిలారు. ఆకతాయిలు పిలిచి ”ఇదిగో చాక్లెట్‌ తీసుకోండి” అని అన్నారు. ”మాకు వద్దు” అని అక్కడి నుంచి పాఠశాల్లోకి వెళ్లిపోయారు.
మరుసటి రోజు కూడా అక్కడే ఉన్న ఆకతాయిలు మళ్లీ పిలిచారు. అమూల్య, వాళ్ల స్నేహితులు వారి మాటలు పట్టించుకోకుండా దూరంగా వెళ్లడంతో ఒక ఆకతాయి దగ్గరికి వచ్చి అమూల్య చేయి పట్టుకున్నాడు. అమూల్య వెంటనే ”హెల్ప్‌.. హెల్ప్‌” అని గట్టిగా కేకలు వేసింది. చుట్టుపక్కల ఉన్న వాళ్లంతా అక్కడ గుమిగూడారు.
”ఎందుకమ్మా.. ఏమైంది” అని అడిగారు.
”వీళ్లు ప్రతిరోజూ ఇక్కడ నిల్చోని మాకు చాక్లెట్లు ఇస్తామని పిలుస్తున్నారు. మేం తీసుకోకపోతే ఈరోజు దగ్గరికి వచ్చి చేయి పట్టుకున్నాడు” అని జరిగిన సంగతిని చెప్పింది అమూల్య.
అక్కడున్న పెద్దలంతా కలిసి వారికి దేహశుద్ధి చేశారు. పక్కనే ఉన్న పోలీస్‌ స్టేషన్లో ఆకతాయిలను అప్పచెప్పారు.
మరుసటి రోజు పాఠశాలకు వచ్చిన పోలీస్‌ అధికారి ”అమ్మాయిలు మీరంతా ధైర్యంగా ఉండాలి. అపరిచితులు ఎవరైనా ఏది ఇచ్చినా.. మనం గుడ్డిగా నమ్మి తీసుకోకూడదు” మన అమూల్య లాగా అందరూ ఎదురు తిరగాలి. ధైర్యంగా ఉండాలి. అప్పుడే మనం సమాజంలో గౌరవంగా, ప్రశాంతంగా బతకగలం” అని చెప్పాడు. అమూల్యను ప్రశంసించి బహుమతిని అందజేశాడు. ఈ విషయం తెలుసుకున్న రమణమ్మ, బిడ్డ ధైర్యానికి సంతోషించింది.
ఆతుకూరి అమూల్య,
7 వ తరగతి,
గూనూ, కోదాడ