– రాత్రిళ్లు చక్కగా పడుకునేలా పేరెంట్స్ చూడాలి
– అట్టడుగు వర్గాలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి : వైద్య నిపుణులు, సామాజిక కార్యకర్తల సూచన
జీవిత పరుగుపందెంలో ఆరోగ్యంపై ఏమాత్రం శ్రద్ధ చూపటం లేదు. యాంత్రిక జీవితంలా మారిన కుటుంబంలో.. భావితరాలను అనారోగ్యం పాలుకాకుండా కాపాడాలని వైద్య నిపుణులు, సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు. పిల్లలు మారాం చేస్తే.. సెల్‌ఫోన్ చేతిలో పెట్టేసే రోజులు మారాలని, రాత్రి పూట తమ బిడ్డల్ని చక్కగా పడుకునేలా తల్లిదండ్రులు దృష్టిపెట్టాలని అంటున్నారు.
న్యూఢిల్లీ : చిన్నారుల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు ఎంతో శ్రద్ధ వహిస్తుంటారు. అయినప్పటికీ,పిల్లలు అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. అయితే, పిల్లల సమగ్రాభివృద్ధి కోసం రాత్రి సమయాల్లో చక్కటి నిద్ర అవసరమని అంటున్నారు వైద్య నిపుణులు. భారత్‌లోని పిల్లలలో నిద్ర రుగ్మతలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. సాంకేతిక పరికరాలు, సేవలు, విద్యాపరమైన ఒత్తిళ్లు వంటివి దీనికి కారణంగా చెప్పవచ్చు. ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్ల కోసం శ్రద్ధ వహించాల్సి ఉంటుందనీ, ఈ విషయంలో తల్లిదండ్రుల జోక్యం మరింత అవసరమని అంటున్నారు. ”ఈ వ్యక్తిగత రుగ్మతల తీరు వివిధ జనాభా సమూహాలలో మారుతూ ఉంటుంది. భారతీయ పిల్లలలో, వ్యక్తిగత నిద్ర రుగ్మతల ప్రాబల్యం 3.2 నుంచి 25.5 శాతం ఉంటుంది” అని 2016 నాటి ఒక అధ్యయనం అంచనా వేసింది.
అలాగే, అక్యూట్ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్‌లు (ఏఆర్‌ఐ) భారత్‌లోని పిల్లలకు గణనీయమైన ముప్పును కలిగిస్తాయి. ఇవి వాయు కాలుష్యం, అధిక రద్దీ, ఆరోగ్య సంరక్షణకు పరిమితులు వంటి కారణాలతో శాశ్వతంగా ఉంటాయి. 2022లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. అధ్యయన కాలంలో భారతదేశంలో ఏఆర్‌ఐ లక్షణాలు కలిగి ఉన్న పిల్లల సగటు శాతం (5 సంవత్సరాలలోపు ) 2.7గా ఉన్నది. అంటే, సర్వే చేయబడిన 238,945 మంది పిల్లలలో 6,529 మంది అన్నమాట. న్యుమోనియా, బ్రోన్కియోలిటిస్, ఇన్ఫ్లుయెంజా వంటి వ్యాధులు ముఖ్యంగా పిల్లలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఇది అధిక అనారోగ్యం, మరణాల రేటుకు దారితీస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లలు సరైన పోషకాహారం, పారిశుధ్యం లేమి కారణంగా హానికర వాతావరణాన్ని కలిగి ఉంటున్నారు. చిన్నపిల్లలు తరచుగా స్పిరోమెట్రీ, పల్మనరీ ఫంక్షన్ పరీక్షలు వంటివి పొందలేరు. బదులుగా ఇంపల్స్ ఓసిల్లోమెట్రీ వంటి ఇతర పరీక్షలను నిర్వహిస్తారు. ఇవి ఖరీదైనవి, చాలా ప్రదేశాలలో అందుబాటులో ఉండవని వైద్య నిపుణులు అంటున్నారు. కాబట్టి ప్రభుత్వాల జోక్యం ఈ విషయంలో అవసరమని చెప్తున్నారు. పిల్లలకు సరైన నిద్ర యొక్క ప్రాముఖ్యతను డాక్టర్ ఛటర్జీ నొక్కి చెప్తున్నారు. సరైన నిద్ర లేకపోవటంతో పిల్లలలో ప్రవర్తన, పనితీరు వంటి ఇతర సమస్యలకు దారి తీస్తుంది. నిద్ర రుగ్మతలు సరైన అభివృద్ధిని నిరోధిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి విషయాల్లో ఒక్క తల్లిదండ్రులు మాత్రమే కాకుండా.. ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచిస్తున్నారు. మరీముఖ్యంగా, అట్టడుగు వర్గాల ప్రజలకు మరింత అవగాహన, సౌకర్యాలను ప్రభుత్వాలు కల్పించాలని నిపుణులు, సామాజికవేత్తలు చెప్తున్నారు.