ఆందోళన వద్దు..

ఆందోళన వద్దు..– నీటి సరఫరాకు ఢోకాలేదు
– నెలకు 2.5 లక్షల ట్రిప్పుల మేర నీటి సరఫరాకు ప్రణాళికలు
– అందుబాటులో మరిన్ని ట్యాంకర్లు
– భూగర్భజలాలు అడుగంటడం, బోర్లు ఎండిపోవడంతో పెరిగిన ట్యాంకర్ల వినియోగం
– ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలి
– పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. దానకిశోర్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
”హైదరాబాద్‌ నగరంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడం వల్లే జలమండలి ట్యాంకర్లకు డిమాండ్‌ పెరిగింది.. అయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. తాగునీటి సరఫరాకు ఇబ్బందేం లేదు” అని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్‌ తెలిపారు. నగరంలో తాగునీటి సరఫరా పరిస్థితిపై సోమవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా దానకిశోర్‌ మాట్లాడుతూ.. ఈ ఏడాది భూగర్భ జలాలు తగ్గడం, బోర్లు ఎండిపోవడంతో నగరంలో గతం కంటే ట్యాంకర్‌ వాటర్‌కు డిమాండ్‌ పెరిగిందని అన్నారు. అయినా అందుకు తగ్గట్టుగానే నీరు సరఫరా చేస్తున్నట్టు వెల్లడించారు. ఈసారి అదనంగా 100 ఎంఎల్‌డీల నీరు సరఫరా చేస్తున్నామన్నారు. అవసరమైతే మరో 100 ఎంఎల్‌డీల నీరు సరఫరా చేసేందుకు జలమండలి సిద్ధంగా ఉందని తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే అదనంగా 10 వేల మంది వినియోగదారులు ట్యాంకర్లు బుక్‌ చేసుకున్నట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో తాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా ఎమర్జెన్సీ పంపింగ్‌ సైతం ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఆయా రిజర్వాయర్లలో కూడా సమృద్ధిగా తాగునీటి లభ్యత ఉందన్నారు. కానీ కొందరు బెంగళూర్‌ పరిస్థితి నగరంలో వస్తుందని ప్రచారం చేస్తున్నారని, అందులో నిజం లేదన్నారు. ఇతర పట్టణాలతో మరో నగరాన్ని పోల్చడం సరికాదన్నారు. అక్కడి నీటి సోర్స్‌ వేరు, మన రాష్ట్రంలో నీటి సోర్స్‌ వేరన్నారు. రాబోయే రోజుల్లో రోజుకు 300 ట్యాంకర్ల ద్వారా 1200 ట్రిప్పులు సరఫరా చేస్తామన్నారు. నెలకు 2.5 లక్షల ట్రిప్పుల మేర నీరు సరఫరా చేసేందుకు ప్రణాళికలు వేశామన్నారు నగరంతోపాటు ఓఆర్‌ఆర్‌ పరిధిలో అవసరమైన చోట అదనపు ఫిల్లింగ్‌ స్టేషన్లు, ఫిల్లింగ్‌ పాయింట్లు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ట్యాంకర్‌ బుక్‌ చేసిన 12 గంటల్లోపే డెలివరీ చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. కొత్త ట్యాంకర్ల కోసం ఆర్టీఏ ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నట్టు తెలిపారు. హిమాయత్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌ నుంచి సరఫరా చేసే నీటిని శుద్ధి చేసేందుకు గండిపేట్‌ కాండూట్‌ మీద చిన్న నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. పాదచారులు, ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు బస్టాండ్లు, జంక్షన్లు, ప్రధాన ఆస్పత్రులు, ఇతర జన సంచార ప్రదేశాల్లో 200 చలివేంద్రాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. నగరంలో భూగర్భ నీటి మట్టాల్ని పెంచేందుకు ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం ట్యాంకర్‌ ద్వారా వాటర్‌ బుక్‌ చేసుకుంటున్న వినియోగదారులకు, ఒకవైపు నీరు సరఫరా చేస్తూనే మరో వైపు ఇండ్లల్లో ఇంకుడు గుంతల నిర్మాణం చేసుకునేందుకు అవగాహన కల్పిస్తామన్నారు. అందుకోసం పలు స్వచ్ఛంద సంస్థల్ని ఉపయోగించుకుంటామన్నారు. ఇంకుడు గుంతలు లేనివారికి కొత్తవి నిర్మించడం, ఉన్న వాటిని మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇంకుడు గుంతలు లేని వారు రూఫ్‌ టాప్‌ రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇలా చేస్తేనే వచ్చే ఏడాది నాటికి ట్యాంకర్ల ద్వారా నీరు బుక్‌ చేసుకునే పరిస్థితి ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఎండీ సుదర్శన్‌ రెడ్డి, ఈడీ డా.ఎం.సత్యనారాయణ, డైరెక్టర్లు, ఆర్టీఏ అధికారులు, సీజీఎంలు, జీఎంలు, ఎన్జీవో సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.