పుస్తెలు అమ్ముకుని, లక్షల రూపాయలు అప్పులు చేసి సొంతిల్లు నిర్మించుకుంటే నిర్దాక్షిణ్యంగా కూల గొడుతున్నారంటూ ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్నారు. మరి నాడు పర్మిషన్లు ఎందుకిచ్చారంటూ అధికారులను నిలదీస్తున్నారు. దశాబ్దాల తరబడి నివసిస్తున్న వారిని ఇల్లూ వాకిలి వదిలి ఉన్నపళంగా పొమ్మంటే ఎలా పోతారు? వాటికి బదులు ఎక్కడో 30 కిలో మీటర్ల ఆవల డబుల్ బెడ్రూం ఇస్తామంటే ఎలా ఒప్పుకుంటారు? తమ ఉపాధిని పోగొట్టుకుని అంతదూరం ఎలా వెళతారు? అందుకే సుందరీకరణ పేరుతో మా బతుకుల ఆగం చేయొద్దని ప్రభు త్వాన్ని వేడుకుంటున్నారు. సరైన ప్రత్యామ్నాయం చూపించకుండా, అఖిలపక్షాలతో సమావేశమవ్వకుండా మూసీ విషయంలో ప్రభుత్వం ఇలా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరైనది కాదు.
ఇప్పుడు రాష్ట్రమంతా మూసీ ప్రక్షాళనపైనే చర్చ. మూసీ ప్రక్షాళన అవసరమే. కానీ కండ్ల ముందే కూలి పోతున్న తమ ఇంటిని చూసుకొని ప్రజలు బోరున విలపిస్తున్నారు. మూసీ సుందరీకరణ పేరుతో జరుగుతున్న ఈ ప్రక్షాళన ఇప్పుడు సాధారణ ప్రజల గొంతుమీద కత్తిలా మారింది. వారి నిలువ నీడను ప్రభుత్వం అమాంతంగా ముంచేయబోతోంది. సామా న్యుల బతుకులు ఫణంగా పెట్టి చేసే ఈ అభివృద్ధి వల్ల ఎవరికి ప్రయోజనమో ఆలోచించాల్సిన తరుణమిది.
మూసీ నదిని హైదరాబాద్ నగర ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో అభివృద్ధి చేయడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్టు రేవంత్‌రెడ్డి అనేక సార్లు ప్రకటనలు చేశారు. దీని కోసం వేల కోట్ల బడ్జెట్ కూడా కేటాయించారు. దుర్గంధంగా మారిన మూసీ నదిని ప్రక్షాళన చేయడం స్వాగతించాల్సిందే. ఇందులో ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. అంతే కాకుండా ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాల రైతులు ఈ నీటితోనే పంటలు సాగు చేస్తున్నారు. ఈ మురికి నీటితో పండించిన పంటల వల్ల ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. అందుకే మూసీ నదిని శుద్ది చేయాలని రైతులతో పాటు వామపక్షాలు ఏండ్ల నుండి డిమాండ్ చేస్తూనే ఉన్నాయి.
ఇప్పుడే కాదు గతంలోనూ అనేక ప్రభుత్వాలు మూసీ ప్రక్షాళన కోసం కోట్లు ఖర్చు పెట్టాయి. ఫలితం మాత్రం శూన్యం. వందల కోట్లు మూసీలో కలిసిపోయాయి. ఇప్పుడు కూడా ఇంత పెద్ద ప్రాజెక్ట్ గురించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్‌లోగానీ, రాజకీయ పక్షాలతో గాని, నగర ప్రజాప్రతినిధులతో గానీ ప్రభుత్వం చర్చలు జరపలేదు. ఈ బఫర్ జోన్‌లోనే హైకోర్టు, సాలర్జంగ్ మ్యూజియం, ఉస్మానియా ఆసుపత్రి, బస్టాండ్ వంటి చారిత్రాత్మక కట్టడాలున్నాయి. మరి వాటిని కూడా కూల్చేస్తారా? అందుకే హైకోర్టు కూడా రేవంత్ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది.
నిజానికి మూసీ నదికి వర్షాకాలంలో కొద్ది రోజులు మాత్రమే వరదలు వస్తున్నాయి. మిగతా ఏడాది మొత్తం నగరంలోని మురికి నీరే ప్రవహిస్తుంది. ఆ నీటిలో రెండు వంతుల మురికి నీరు మూసీలో నేరుగా కలుస్తుంది. దీని కారణంగా బస్తీ ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. దోమల ఉత్పత్తికి మూసీ ప్రధాన కేంద్రంగా మారింది. అందుకే సుందరీకరణ కంటే ముందే మూసీ నీటిని శుద్ది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాస్తవానికి మూసి పరిసర బస్తీల్లోని అతి కొద్ది భాగం మినహా మెజారిటీ బస్తీలు ఏనాడు వరదల్లో మునగలేదు. 2020 నాటి మూసీ వరదల నాటి లెక్కలు తీస్తే ఈ విషయాలు బయటపడతాయి. నిజంగా ప్రభుత్వం ప్రజలను వరదల బారి నుండి కాపాడాలంటే కేవలం ముంపునకు గురయ్యే బస్తీలకే ప్రత్యామ్నాయం చూపించాలి. అలా కాకుండా ముంపుకు గురికాని బస్తీలను కూడా ఎందుకు తొలగిస్తున్నారు? మూసీని ప్రక్షాళన చేయడం వేరు, సుందరీకరణ చేయడం వేరు. సుందరీకరణకంటే ముందు ప్రభుత్వం శుద్దీకరణ, మురుగు నీటిని నిరోధించడం మీద శ్రద్ధ పెట్టాలి. మూసీ భూమిని కబ్జా చేసిన బడా బాబుల నిర్మాణాలను కూలగొట్టాలి. మరింత ఆక్రమణకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజాప్రయోజనాలకి, పర్యావరణానికి మొదటి ప్రాధాన్యమివ్వాలి. ఆ తర్వాతే సుందరీకరణ, రియల్ ఎస్టేట్, టూరిజం.
వాస్తవానికి మూసీ ప్రక్షాళన జరగాల్సిందే. దానికి అవసరమైన చర్యలు చేపట్టాల్సిందే. దాని కోసం పేదల ఇండ్లను కూల్చడం మాత్రం సరైనది కాదు. కార్పొరేట్ కంపెనీల వ్యాపారం కోసం పేదల ఇండ్లను తొలగించడం దారుణం. పైగా ఆ ప్రాంత ప్రజలతో, రాజకీయ పార్టీలతో చర్చించకుండా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం అస్సలు మంచిది కాదు. మూసీ నదితో ముడిపడి, నది పరిసరాల్లో నివసిస్తున్న వేలాది మంది పేదలను అభివృద్ధిలో భాగస్వాములను చేయకుండా, వాళ్ల ఉపాధిని పట్టించుకోకుండా వారిని నగరం అవతలకు తరలించడం ప్రజా పాలన అనిపించుకోదని ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలి.