పదేండ్లు మీపాలనలో ఫూలే గుర్తుకు రాలేదా?

పదేండ్లు మీపాలనలో ఫూలే గుర్తుకు రాలేదా?– అసెంబ్లీలో కాదు…రాజకీయాలు బయట చేసుకోండి
– ఎమ్మెల్సీ కవితకు మంత్రి పొన్నం హెచ్చరిక
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
గత పదేండ్లుగా బీఆర్‌ఎస్‌ అధికారంలోకి ఉండి కూడా అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. రాజకీయాలు అసెంబ్లీ ఆవరణలో కాకుండా బయట చేయాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు సూచించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్ష పదవి, కార్యనిర్వాహక పదవి, ప్రతిపక్ష నేత పదవులను బీసీలకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అప్పుడే బీఆర్‌ఎస్‌ చిత్తశుద్దిని ప్రజలు నమ్ముతారని అన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చాక దేశ వ్యాప్తంగా కులగణన చేస్తామంటూ రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారన్నారు. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో కూడా కులగణన ప్రస్తావన ఉందన్నారు. రేవంత్‌ నాయకత్వంలో బీసీ సంక్షేమానికి అవసరమైన నిధుల కేటాయింపు కూడా జరగబోతుందన్నారు. మెస్‌ చార్జీలు ఎక్కడా ఆగకుండా చూస్తున్నామన్నారు. గ్రీన్‌ ఛానెల్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. గత కొద్ది సంవత్సరాలుగా మెస్‌చార్జీలు రాలేదని గుర్తు చేశారు. టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులను సంబంధించి భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బీసీలకు 100 శాతం న్యాయం జరిగే విధంగా సలహాలు అడుగుతున్నట్టు తెలిపారు. మహేష్‌కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ బీసీల వాటా కోసం తమ ప్రభుత్వం ఎప్పుడూ పని చేస్తుందని తెలిపారు. మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్‌ మాట్లాడుతూ దేశ సంపద ఎవరి చేతిలో ఉందో తేలాలని కోరారు.