వాన పాటంటే జనాలు చచ్చేంత పడిచస్తారు. పాత కాలం నుండి ఇప్పటి కాలం వరకూ బాగా తీసిన అలాంటి పాటల్ని జనం మెచ్చుతూనే ఉన్నారు. మనిషికి వర్షానికి ఉన్న సంబంధం అటువంటిది మరి. ఎండాకాలమంతా విసిగిపోయి ఏ ఊటీకో, కొడైకెనాల్‌కో పోయొస్తే కొంత సేద తీరినా వచ్చినాక మళ్ళీ అదే స్థితి, అదే పరిస్థితి. ఎక్కడికిపోయినా, దేశమంతా తిరిగినా మన ఇంటికి, మన ఊరికి మనం రావలసిందే. అయితే బయటి ప్రాంతాలకు, దేశాలకు పోయినప్పుడు మన గురించి గొప్పలు ఎన్నో చెప్పుకోవచ్చు. ఇక్కడ జనాల మధ్య చిచ్చు పెట్టి అందరూ కొట్టుకొంటున్నా అక్కడ నీతి వాక్యాలు, శాంతి వాక్యాలు చెప్పొచ్చు. జపం జపం జపం…కొంగ జపం, తపం తపం తపం… దొంగ తపం అన్న పాటకు న్యాయం చేకూర్చేలా నటనలో ఆరితేరిన వారిలా కూడా ప్రవర్తించొచ్చు. వానొస్తే బురద ఫ్రీ అని మనకంతా తెలుసు. అయితే ఆ వానపాటలో బురద ఉండే నీళ్ళే పోసినవే పోసి షూటింగు అయ్యేంత వరకూ నానా కష్టాలు పడ్డామని నటీనటులు చెప్పడం వింటూ ఉంటాం. అది నిజం. హాయిగా ఏసీ హాలులో వానపాట చూసి డిటిఎస్‌లో పక్కనుండు వాన శబ్దాలు, ఉరుముల శబ్దాలు వస్తుంటే అది ఎండాకాలమైతే ఇంకా చల్లగా అనుభవమవుతుంది చూసేవాళ్ళకి.
వాన తనంతట తాను వచ్చిపోతే పెద్ద ఇబ్బంది ఉండనే ఉండదు, పరేషాన్ అసలే ఉండదు. కాని అది పోకుండా, మనుషుల్ని బయటకు పోనీయకుండా పడుతూ ఉంటేనే ఇబ్బంది. ఎక్కువరోజులు వాన కురిస్తే దుర్యోధనుడు, కర్ణుడి కథ గుర్తొస్తుంది. వాళ్ళిద్దరిలో ఎవరు నిజంగా దానగుణం ఉన్నవారు అని ఇంద్రుడు పరీక్ష పెడతాడు. అతణ్ణి ఎవరైనా ఆ పరీక్ష పెట్టమన్నారో గుర్తుకు రావడం లేదు. బ్రాహ్మణుడి వేషంలో ఇద్దరి దగ్గరికీ పోయి పెళ్ళిలో వంట చేయడానికి కట్టెలు కావాలని అడుగుతాడు. ఆ తేదీకి ముందు వారం రోజులు ఇప్పుడు పడుతున్న వర్షాల్లాగే వాన కురిపిస్తాడు. దేశంలోని కట్టెలన్నీ నానిపోయాక పోయి అడుగుతాడు నాకిస్తాను అన్న వంట చెరకు ఇప్పించమని. ఎక్కడ చూసినా తడిసిపోయిన కట్టెలే ఉన్నాయని దుర్యోధనుడు ఇవ్వలేనని చేతులెత్తేస్తాడు. కర్ణుడు మాత్రం తానున్న భవనం పడగొట్టి అందులో ఉన్న దూలాలను తీయించి, ముక్కలు ముక్కలుగా చేయించి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు. అది కథ కావచ్చు కాని రాజుల పాలన ఎలా ఉంటుంది, ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకుంటారు అన్నది తెలుపుతుంది. ఆ కాలంలో ఎన్నికల మ్యానిఫెస్టోలు ఉండేవి కాదసలు.
ఆ మధ్య ఓ చిరుత అడవిలోనుంచి వచ్చి నగరంలోని జనాల్ని భయపెట్టింది. అలాగే ఇతర జంతువులు. తమ అడవుల్ని మనిషి ఆక్రమించుకుంటే అవి మాత్రం ఏం చేస్తాయి చెప్పండి. అలాగే నీరు కూడా మౌనంగా తన పని తాను చేసుకుంటూ నీరు పల్లమెరుగు అన్న సూత్రాన్ని వదలకుండా తన తడాఖా చూపిస్తోంది. తన చెరువుల్ని, కాల్వల్ని, వాగుల్ని మనిషి ఆక్రమించుకొని ఇళ్ళు, సినిమా హాళ్లు, హోటళ్లు ఇలా కబ్జా చేసి కట్టుకున్న కట్టడాల్ని ముంచేసి తన కోపం తెలియజేస్తుంది. నిజం చెప్పాలంటే మనిషి నైజాన్ని జనాలకి కళ్ళకు కట్టేలా చూపించి మనిషి కళ్ళు తెరవాల్సిన సమయం వచ్చిందని చెప్పకనే చెబుతోంది. అసమదీయులు, తసమదీయులు అన్నట్టు తమకు కావలసిన వారికి చెరువుల్ని రాసిచ్చిన నాయకులే ఇప్పటి పరిస్థికి సంజాయిషీ ఇవ్వాలి. ఇదేమీ ఒక్కరోజుతో పోయే సమస్య కాదు. ప్రతి సంవత్సరం వానలొస్తాయి, ప్రతి ఐదేండ్లకీ ఎన్నికలొస్తాయి. మనిషికి తెలివి మాత్రం రాదు. అలా అనుకొని పట్టించుకోని వాళ్ళుంటారు, ప్రజల్ని మేలుకొలిపే వాళ్ళూ ఉంటారు. నాయకులు మాత్రం మేలుకోరన్న సత్యం కుండపోత వర్షాల వల్ల తెలుస్తోంది.
ఈసారి ఎన్నికల వాగ్దానాలలో వర్షాకాలంలో మేము ఇవి చేస్తాము, అవి చేస్తాము అని మాత్రం చెప్పాల్సిందే. లేదంటే పుట్టి మునిగిపోతుందంతే. మచ్చుకి కొన్ని వాగ్దానాలు చూద్దాం. ఇంటింటికీ పడవ పథకం, ట్యూబు మాది గాలి మీది, రాత్రికే ఇంటికి చేరే పథకం, పడవ కారు బోటు షికారు, మీరు నీరు ఒక ప్రాణం ఒక వాహనం, నిర్భంద ఈత సూత్రం, వానా వానా వెల్లువాయే ఉచిత గొడుగులు, నీళ్లు దూరని గృహ పథకం, రోడ్డే మన కాలువ స్కీము, దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మెట్రో పడవ లైన్లు, చినుకు మాది కునుకు మీది ఇలా ఉండే అవకాశం ఉంది. ఇంటింటికీ ఉచిత నీరు అన్న వాగ్దానం మాత్రం నిజంగా ఉచితంగా ఏమాత్రం కష్టపడకుండా నెరవేర్చేదిగా కనిపిస్తోందిప్పుడు. జాగా లేదు కాని ఈ వరదనీటితో ఒక విద్యుత్ ప్రాజెక్టు కూడా కట్టొచ్చని బాగా విజన్ ఉన్న పెద్ద మనిషి చెప్పొచ్చు కూడా. కావాలని వర్షాలు కురిపిస్తున్నారు అని తమ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి మాటల తూటాలు వేయొచ్చు కూడా. నోరు తెరిస్తే వరద లాగా వచ్చే మాటలు నిజంగా వరదలు వస్తే కాని గుర్తుకు రాని వాస్తవాన్ని చూపుతున్నాయి. రుతువులు మారిపోయినట్టు రాజకీయాలూ మారుతూ ఉన్నాయి. వాటిమీద నియంత్రణ ఎలాగైతే లేదో వీటిమీదా అదే పరిస్థితి.
వరదరాజ స్వామి గురించి అందరూ వినే ఉంటారు. అయితే వరద రాజకీయ స్వాముల గురించి కూడా తెలుసుకోవలసిన సమయం ఇది. ఇక్కడ రోడ్లన్నీ నదులైనాయని, కాంప్లెక్సులన్నీ చెరువులైనాయనీ చెప్పే ఈ బడా స్వాములు తాము పాలించే రాష్ట్రాల్లో వర్షాలు, వరదలు వచ్చి సముద్రాలైనా ఇక్కడ మాత్రం ఫలానా విధంగా చేస్తాం, ఇంతటి ఘోరాన్ని రానివ్వం అని ఘోరాలకీ నేరాలకి తాము దూరమని బుకాయిస్తారు. ప్రజల్ని నిజంగా కులాలు, మతాలను చూపి మత్తుమందు ఇచ్చినట్టు తయారు చేసినోళ్ళే ఇప్పుడు మీరు మేలుకోవాలనడం విడ్డూరం. అసలు మొదటినుండీ పాలించిన కొందరు ఇదేందిర భై అసలు ప్రభుత్వం నిద్రపోతుందా అనీ అంటారు. అసలు రాష్ట్రాన్ని ఇచ్చిందే మేము అంటారు కాని ఇలా ఎందుకు ఉంది అంటే మాత్రం సమాధానం ఉండదు. వరదలాంటి ఎన్నో ప్రశ్నలకి మాటలు కరువే మరి. వాన వెల్లువవ్వడం తమకు ఓట్లు వెల్లువలా పడాలనుకోవడం వరదల్ని కూడా క్యాష్ చేసుకునే రాజకీయాలు నడుస్తున్నాయి.
జంధ్యాల రఘుబాబు
9849753298