నవతెలంగాణ- కమ్మర్ పల్లి: మండలంలోని ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ప్రచారం జోరుగా, హుషారుగా కొనసాగుతుంది. ఆయా గ్రామాల్లో బూత్ ఇంచార్జిలా ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. ఓటర్లకు గ్రామంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు. గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలతో కూడిన కరపత్రాలను ఓటర్లకు అందజేస్తూ కారు గుర్తుకు ఓటు వేసి మంత్రి ప్రశాంత్ రెడ్డినీ మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నారు. ప్రతిపక్ష నాయకులు చెప్పే మోసపూరిత వాగ్దానాలను నమ్మి మోసపోవద్దని, అభివృద్ధి చేసిన వ్యక్తిని కడుపులో పెట్టుకొని కాపాడుకోవాల్సిన బాధ్యత ఓటర్ల పై ఉందని అవగాహన కల్పిస్తున్నారు. గతంలో రాష్ట్రాలను పాలించిన కాంగ్రెస్ పార్టీ హాయంలో ప్రజలు ఎదుర్కొన్న త్రాగునీటి, సాగునీటి, విద్యుత్ ఇబ్బందులను గుర్తు చేస్తున్నారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులపై వివరిస్తున్నారు. ముచ్చటగా మూడోసారి రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయితే నూతనంగా అమలు చేయనున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీని ఆదరించి గెలిపించాలని కోరుతున్నారు. గ్రామాల్లో ఏ ఇంటిని వదలకుండా ప్రతి ఇంటి గడపను తొక్కుతూ హుషారుగా ప్రచారం చేస్తున్నారు. ఓటర్ల నుండి కూడా మంచి స్పందన వస్తుండడంతో నాయకులు, కార్యకర్తలు సంతోషంతో ప్రచారాన్ని ఉధృతంగా సాగిస్తున్నారు