భారత్‌లో డోపింగ్‌ కలవరం!

న్యూఢిల్లీ: ఇప్పుడిప్పుడే క్రీడా దేశంగా ఎదుగుతున్న భారత్‌ను డోపింగ్‌ పిడుగు కలవరపాటుకు గురి చేస్తుంది. 2000కు పైగా శాంపిల్స్‌ పరీక్ష చేసిన దేశాల్లో అత్యధిక పాజిటివ్‌లు భారత్‌లోనే ఉన్నాయి. భారత్‌లో 3,865 శాంపిల్స్‌ (యూరిన్‌, బ్లడ్‌ కలిపి) పరీక్ష చేయగా.. అందులో 125 శాంపిల్స్‌లో నిషేధిత ఉత్పేరకాల అవశేషాలు బయటపడ్డాయి. భారత్‌లో పాజిటివ్‌ టెస్టుల శాతం 3.2 శాతంగా వాడా తాజాగా విడుదల చేసిన నివేదికలో తెలిపింది. ఓవరాల్‌గా పరీక్ష చేయబడిన శాంపిల్స్‌ అంశంలో భారత్‌ 11వ స్థానంలో నిలిచినా.. పాజిటివ్‌ విషయంలో మాత్రం అగ్రస్థానంలో నిలిచింది. రష్యా (85), అమెరికా (84), ఇటలీ (73), ఫ్రాన్స్‌ (72)లో తక్కువ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికా 2033 శాంపిల్స్‌ పరీక్ష చేయగా 2.9 పాజిటివ్‌ రేట్‌తో భారత్‌ తర్వాతి స్థానంలో నిలిచింది. చైనా అత్యధికంగా 19228 శాంపిల్స్‌ టెస్టు చేయగా.. కేవలం 0.2 శాతం పాజిటివ్‌గా తేలాయి.