– మంత్రి పొన్నం ప్రభాకర్‌కు టీపీడీపీఎంఏ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ ప్రయివేటు డిగ్రీ, పీజీ కాలేజీ యాజమాన్యాల సంఘం (టీపీడీపీఎంఏ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను సోమవారం హైదరాబాద్‌లో ఆ సంఘం అధ్యక్షులు బి సూర్యనారాయణరెడ్డి, నాయకులు రమణారెడ్డి, టి శ్రీధర్‌రావు, ఎ పరమేశ్వర్ కలిసి వినతిపత్రం సమర్పించారు. డిగ్రీ కాలేజీల్లో బీబీఏ, బీసీఏ కోర్సుల అనుమతి నిర్వహన బాధ్యతను విశ్వవిద్యాలయాల పరిధి నుంచి తప్పించి ఏఐసీటీఈ పరిధిలోకి తీసుకెళ్లె ప్రయత్నం వెంటనే అడ్డుకోవాలని కోరారు. డిగ్రీ ఆన్‌లైన్ అడ్మిషన్ల కోసం ఏర్పాటు చేసిన దోస్త్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి ఇంటర్ తరహాలోనే కాలేజీ యాజమాన్యాలు సొంతంగా అడ్మిషన్లు చేపట్టి విశ్వవిద్యాలయాల వెబ్‌సైట్‌లో పెట్టేలా నిబంధనలను రూపొందించాలని సూచించారు. అడ్మిషన్ల విషయంలో స్వయం ప్రతిపత్తి గల వర్సిటీల నియంత్రణ మాత్రమే ఉండాలని తెలిపారు. రెండేండ్లకు ఒకసారి ఫీజులను సవరించాలని పేర్కొన్నారు. సొంత భవనాలు కలిగిన కాలేజీలకు శాశ్వత అనుబంధ గుర్తింపు ఇవ్వాలని సూచించారు. పదేండ్లు పూర్తి చేసుకున్న కాలేజీలకు ఐదేండ్లకోసారి అనుబంధ గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఆస్తిపన్ను, విద్యుత్ చార్జీల్లో బడ్జెట్ విద్యాసంస్థలకు వేరే కేటగిరీ ఏర్పాటు చేసి రాయితీ కల్పించాలని తెలిపారు.
హిందీ పండితులకు న్యాయం చేయాలి : ఎస్‌ఎల్‌టీఏ
హిందీ పండితులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని రాష్ట్ర భాష ఉపాధ్యాయ సంస్థ (ఎస్‌ఎల్‌టీఏ) అధ్యక్షులు చక్రవర్తుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కె గౌరీశంకర్‌రావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. యూజీసీ గుర్తింపు ఉన్నా అధికారులు ఆ ధ్రువపత్రాలను తిరస్కరించడం సరైంది కాదని పేర్కొన్నారు.