– ఆగస్టు 2 వరకు రిజిస్ట్రేషన్
– 3 వరకు వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశం
– 6న సీట్ల కేటాయింపు
– షెడ్యూల్ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం ఒకేషనల్, బీకాం ఆనర్స్, బీఎస్‌డబ్ల్యూ, బీబీఏ, బీసీఏ, బీబీఎం, బీసీఏ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గురువారం నుంచి వచ్చేనెల రెండో తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గడువుందని తెలిపారు. ఈనెల 27 నుంచి వచ్చేనెల మూడో తేదీ వరకు వెబ్‌ఆప్షన్లను నమోదు చేసేందుకు అవకాశముందని వివరించారు. అదేనెల రెండున ప్రత్యేక కేటగిరీ విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు. వచ్చేనెల ఆరో తేదీన ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు ఉంటుందని వివరించారు. అదేనెల ఏడు నుంచి తొమ్మిదో తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలనీ, ఫీజు చెల్లించాలని కోరారు. ఆయా తేదీల్లోనే కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేయాలని తెలిపారు. విద్యార్థులు పూర్తి వివరాలకు https://dost.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.