– లబ్దిదారులను ఎంపిక చేసి, ఏడాది గడిచినా గృహ ప్రవేశానికి నోచుకోని వైనం..
– లబ్దిదారులకు వెంటనే గృహ ప్రవేశం చేయించాలి
– సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు ఎండి. పయాస్
నవతెలంగాణ-రంగారెడ్డి డెస్క్
ఎంపికైన లబ్దిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లు వెంటనే గృహ ప్రవేశం చేయించాలని సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు ఎండీ. ఫయాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండల పరిధిలోని నోముల గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మండలంలోని నోముల గ్రామ రెవెన్యూ పరిధిలో లింగంపల్లి గేటు వద్ద నిర్మించిన 96 డబుల్ బెడ్రూం ఇండ్లను ఏడాది క్రితమే నోముల, లింగంపల్లి, మంచాల గ్రామాల వారికి గ్రామ సభల ద్వారా డ్రా పద్ధతిలో లబ్దిదారులను ఎంపిక చేసినట్టు తెలిపారు. కానీ ఎంపికై ఏడాది గడుస్తున్నా, నేటికి లబ్దిదారులు గృహ ప్రవేశానికి నోచుకోలేదన్నారు. ముఖ్యంగా కొన్నేండ్లుగా ఇండ్లు లేక అనేక ఇబ్బందులు పడుతూ జీవనం గడుపుతున్న వారికి ఇండ్లు రావాడంతో ఆనందించారు. కానీ ఆ ఇండ్లు గృహ ప్రవేశం కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా గృహ ప్రవేశం చేయకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారాయని అన్నారు. కావున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, డబుల్ బెడ్రూం ఇండ్లలో విద్యుత్ సౌకర్యం, నీటి వసతి మొదలగు మౌలిక వసతులు ఏర్పాటు చేసి లబ్దిదారులకు గృహ ప్రవేశం చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియేడలా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.