క్యాతూర్‌లో డబుల్‌ బెడ్రూం ప్రారంభం

అలంపూర్‌ : మండలంలోని క్యాతూర్‌లో రూ. 125 లక్షలతో నిర్మించిన 20 డబుల్‌ బెడ్‌ రూమ్‌లను మంత్రి నిరంజన్‌ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ సరిత తిరుపతయ్య, కలెక్టర్‌ వల్లూరు క్రాంతి, ఎమ్మెల్యే అబ్రహం ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే అబ్రహం అధ్యక్షతన నిర్వహించిన సభలో మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో అత్యంత పేదవారిని డబల్‌ బెడ్‌ రూమ్‌ పంపిణీకి లబ్ధిదారులుగా అధికారులు గుర్తించారని వారికి డబల్‌ బెడ్‌ రూమ్‌ పట్టాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మరో ఐదు నెలల్లో గృహలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు మూడు లక్షలు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా నియోజకవర్గంలో 3వేల మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూరుతుందన్నారు. తెలంగాణలో కెసిఆర్‌ అధికారంలోకి వచ్చిన తొమ్మిది సంవత్సరాలు కాలంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కెసిఆర్‌ ప్రభుత్వం రైతుబంధు, కళ్యాణ్‌ లక్ష్మి, రైతు బీమా వంటి పథకాలు చేపట్టిందన్నారు. తెలంగాణలో మరోసారి బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందని, కెసీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ పాలన కొనసాగిస్తుందని, రైతు చనిపోతే ఐదు లక్షలు ఇస్తుందని, కళ్యాణ లక్ష్మి ద్వారా 1లక్ష 116 రూపాయలు ఇస్తోందని, కెసిఆర్‌ కిట్టు కంటి వెలుగు వంటి పథకాలను అమలు చేస్తుందన్నారు. క్యాతూర్‌ గ్రామంలో రూ.26 కోట్ల రూపాయలతో లిఫ్టు, హాస్పిటల్‌ భవనము,సీసీ రోడ్లు నిర్మించుకున్నామని రానున్న కాలంలో గ్రామం మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్‌ సుభాష్‌ నాయుడు, సర్పంచ్‌ లలితమ్మ, ఎంపీపీ బేగం, మున్సిపల్‌ చైర్పర్సన్‌ మనోమా, ఎంపీటీసీ, ఏడి సక్రియ నాయక్‌, మండల వ్యవసాయ అధికారిని అనిత, అనురాధ పాల్గొన్నారు.
సీపీఎం వినతి..
ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు అవకాశం కల్పించాలని సీపీఎం వినతి.. గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉన్న ప్రభుత్వ స్థలంలో ఆ కాలనీలో ఉన్న పేదలు గహలక్ష్మి ద్వారా ఇండ్లు నిర్మించుకునేందుకు అవకాశం కల్పించాలని, అసలైన వారికి రేషన్‌ కార్డులు, పెన్షన్లు ఇవ్వాలని, డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని మంత్రి నిరంజన్‌ రెడ్డికి సిపిఎం గ్రామ కార్యదర్శి బంగారు రఫీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.