– ఆంధ్ర తొలి ఇన్నింగ్స్ 448/9
నవతెలంగాణ-హైదరాబాద్
ఆంధ్ర యువ బ్యాటర్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్ (203, 372 బంతుల్లో 28 ఫోర్లు) ద్వి శతకంతో దుమ్మురేపాడు. రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-బిలో ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్‌తో మ్యాచ్‌లో షేక్ రషీద్ సూపర్ ఇన్నింగ్స్ నమోదు చేశాడు. కరణ్ షిండె (109, 221 బంతుల్లో 12 ఫోర్లు) తోడుగా మూడో వికెట్‌కు 236 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేసిన షేక్ రషీద్ ఆంధ్రకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కట్టబెట్టాడు. కెప్టెన్ హనుమ విహారి (0) డకౌట్‌గా నిష్క్రమించినా కె.ఎస్ భరత్ (33), సందీప్ (33 నాటౌట్) మెరవటంతో ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 143 ఓవర్లలో 9 వికెట్లకు 448 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో అనికెత్ రెడ్డి (4/137), సివి మిలింద్ (2/57), రక్షణ్ రెడ్డి (2/75) రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్‌పై 147 పరుగుల ముందంజ సాధించింది. నేడు చివరి రోజు ఆట కావటంతో ఫలితం కోసం హైదరాబాద్‌పై ఒత్తిడి పెంచేందుకు ఆంధ్ర ప్రయత్నం చేయనుంది. తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 301 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. నేడు మ్యాచ్ ఫలితం తేలకపోయినా.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఆంధ్ర విలువైన పాయింట్లు సొంతం చేసుకోవటం ఖాయం.