– నిరుద్యోగులకు రెండింతల కష్టాలు : రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ఆదివారం బిజెపిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మంటే ‘నిరుద్యోగులకు రెండింత కష్టాలు’ అని అర్థమని విమర్శించారు. ఈ మేరకు ఆదివారం తన సోషల్ మీడియాలో హిందీలో ఒక పోస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రతీ మూడో యువకుడు ‘నిరుద్యోగం అనే వ్యాధి’తో బాధపడుతున్నారని రాహుల్ తెలిపారు. ‘ఉత్తరప్రదేశ్‌లో 1.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్న భర్తీ చేయడం లేదు. దీంతో కనీస విద్యార్హతతో భర్తీ చేసే పోస్టులకు కూడా గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, పిహెచ్‌డి హోల్డర్లు లైన్‌లో నిలబడి ఉన్నారు’ అని రాహుల్ తన పోస్టులో తెలిపారు. ‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వమంటే నిరుద్యోగులకు రెండింతల కష్టాలు’ అని విమర్శించారు. ‘రిక్రూట్‌మెంట్ ప్రకటనలకోసం నిరుద్యోగులు వేచి చూడ్డం మొదటది. రెండోది రిక్రూట్‌మెంట్ ప్రకటన వచ్చి పరీక్ష జరిగినా ఆ పేపర్ లీకవుతుంది. దీంతో ఆ పరీక్షల ఫలితాలు విడుదల కావు’ అని రాహుల్ వివరించారు. ఒకవేళ ఫలితం వచ్చినా సుదీర్ఘకాలం వేచి వుండాలని. జాయినింగ్‌లపై భరోసా కోసం కోర్టులకు తరుచూ వెళుతూ ఉండాలని రాహుల్ తెలిపారు. ఆర్మీ నుంచి రైల్వే వరకూ.. ఉపాధ్యాయ పోస్టుల నుంచి పోలీసు రిక్రూట్‌మెంట్లు కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తూ లక్షలాది మంది నిరుద్యోగులు వయోపరిమితి దాటిపోయారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నిరాశలతో విద్యార్ధులు డిప్రెషన్‌కు గురై కుంగిపోతున్నారని, తమ డిమాండ్లతో వీధుల్లోకి వస్తే పోలీసుల చేత లాఠీ దెబ్బలు ఎదుర్కొంటున్నారని రాహుల్ తెలిపారు. ఒక విద్యార్థికి ఉద్యోగం అంటే కేవలం ఒక ఆదాయ వనరు మాత్రమే కాదని, అతని కుటుంబ జీవితాన్ని మార్చే కలని, ఉత్తరప్రదేశ్‌లో ఈ కలలు చెదిరిపోతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ విధానాలు మాత్రమే యువత కలలకు న్యాయం చేస్తాయని, యువకుల తపస్సును వృథా కానివ్వమని రాహుల్ తన పోస్టులో తెలిపారు.