రెట్టింపు వినోదం

రెట్టింపు వినోదంసితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ రూపొందించిన ‘మ్యాడ్‌’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఆ బ్లాక్‌బస్టర్‌ చిత్రానికి సీక్వెల్‌గా ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ని రూపొందిస్తున్నారు. ‘మ్యాడ్‌’తో రచయిత-దర్శకుడిగా పరిచయమైన కళ్యాణ్‌ శంకర్‌ ‘మ్యాడ్‌ స్క్వేర్‌’తో రాబోతున్నారు. ‘మ్యాడ్‌’లో నటించి మెప్పించిన యువ కథానాయకులు నార్నే నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ త్రయం ఈ సీక్వెల్‌ కోసం మళ్ళీ రంగంలోకి దిగారు. కథానాయికల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. మ్యాడ్‌ ఎంతలా నవ్వులు పంచిందో, దానికి రెట్టింపు వినోదం సీక్వెల్‌ ద్వారా అందించబోతున్నట్లు మేకర్స్‌ తెలిపారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ సినిమా ప్రారంభోత్సవానికి సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు కె.వి. అనుదీప్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడుకి స్క్రిప్ట్‌ అందజేసిన సిద్ధు జొన్నలగడ్డ, చిత్ర బందానికి శుభాకాంక్షలు తెలిపారు .అలాగే నిర్మాత సూర్యదేవర నాగవంశీ కుమార్తె, ఆయన సోదరీమణులు హారిక సూర్యదేవర, హాసిని సూర్యదేవర కూడా ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర హారిక, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.