ఉపాధి హామీ పనులలో నిర్లక్ష్యం వద్దు: డీపీఓ శ్రీనివాసరావు

నవతెలంగాణ – భిక్కనూర్
ఉపాధి హామీ పనులలో నిర్లక్ష్యం వహించవద్దని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. బుధవారం భిక్కనూర్ పట్టణంలో ఉన్న మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డిపిఓ మాట్లాడుతూ గ్రామాలలో నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ కూలీ పని కల్పించే విధంగా చూడాలన్నారు. ఉపాధి పనులలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని, గ్రామంలో 100% ఇంటి పన్ను వసూలు అయ్యేవిధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఏపీవో రాధిక, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, తదితరులు ఉన్నారు.