ఆసియా ఖండంలోని అతిపెద్ద ఆదివాసి గిరిజన జాతరైన మేడారం మహా జాతర అభివృద్ధి పనులను మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డా. ఎ. శరత్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి పరిశీలించారు. మేడారం అమ్మవార్ల గద్దెల ఆలయ పరిసరాల్లో జాతరకు వచ్చే ముఖ్య అతిథుల కోసం ఏర్పాటుచేసిన కంటైనర్ అతిథి గృహాన్ని పరిశీలించారు. అనంతరం ఆర్టిసి బస్టాండ్ ప్రాంగణాన్ని క్యూ లైన్ లను పరిశీలించి జిల్లా కలెక్టర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ జాతరకు భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున 60 ఎకరాలలో ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి భక్తుల కోసం టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. గత జాతరలో 40 ఎకరాలలో ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు చేయడం జరిగిందని ఈసారి మాత్రం మరో 20 ఎకరాలను కలుపుకొని 60 ఎకరాలలో ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ఆరువేల బస్సులను నడపనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, దేవదాయశాఖ అధికారి రాజేందర్, స్థానిక ఎమ్మార్వో తోట రవీందర్, ప్రోటోకాల్ అధికారి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.