– ఎమ్మెల్యే మందుల సామేలు
నవతెలంగాణ తుంగతుర్తి: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత, విశ్వవిజ్ఞాని, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా దేశానికి దశ, దిశ చూపిన మహానుభావుడని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు అన్నారు. శుక్రవారం అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. ఈ మేరకు భారత తొలి న్యాయ శాఖ మంత్రిగా దేశానికి ఎనలేని సేవలు చేశారని,బడుగు బలహీన వర్గాలకు బీసీ, మైనార్టీలకు, ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. మహిళలకు ఓటు హక్కు కల్పించిన ఘనత అంబేద్కర్ కే దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఆర్థిక అసమానతలను తొలగించేందుకు ఎస్సీ ఎస్టీ వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసేందుకు రాజ్యాంగంలో హక్కులు కల్పించారని అన్నారు. స్వేచ్ఛ సమానత్వం కోసం తుదిశ్వాస వరకు పనిచేశారని గుర్తు చేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అంటరానితనం కులవివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసి, కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపిన మహానుభావుడు అంబేద్కర్ అన్నారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, మండల పార్టీ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, పట్టణ అధ్యక్షులు ఉప్పుల రాంబాబు,నల్లు రామచంద్రారెడ్డి, అనిల్ మండల పరిధిలోని వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.