– మంచి ఆహారపు అలవాట్లు, క్రమం తప్పని వ్యాయామం
– ఆరోగ్యవంతమైన జీవన విధానానికి పునాది
– తాడ్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ చిరంజీవి
నవతెలంగాణ – తాడ్వాయి
డాక్టర్స్ డే సందర్బంగా ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని తాడ్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రముఖ వైద్యులు (మెడికల్ ఆఫీసర్) చిరంజీవితో ప్రత్యేక ఇంటర్వ్యూ !
నవతెలంగాణ : డాక్టరు గారు నమస్తే, డాక్టర్స్ డే శుభాకాంక్షలు.
డాక్టర్ : నమస్కారం థాంక్ యూ . వైద్యులందరికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు.
నవతెలంగాణ : అనారోగ్య సమస్యలు ఉన్నవారికి మీరిచ్చే సూచన ? మీరు అందించే చికిత్స ఏమిటి ?
డాక్టర్ : అనారోగ్య సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రి ని సంప్రదించాలి. అప్పుడు రోగి లక్షణాలు, వారికి కలుగుతున్న అనారోగ్య సమస్యలు వారి మాటల ద్వారా తెలుసుకొని, సరిఅయిన రీతిలో పేషంట్ అనారోగ్య సమస్యను డయాగ్నోసిస్ ( గుర్తించి ) చేసి తాము ఇచ్చే చికత్స ద్వారా తగ్గే అవకాశం ఉంటే తగ్గించడం, లేదంటే పేషంట్ ని సంబంధిత ప్రత్యేక వైద్యుని వద్దకు చికత్సకోసం వెళ్ళమని సూచించడం జరుగుతుంది.
నవతెలంగాణ : సీజనల్ వ్యాధులు అంటే ఏమిటీ ?
డాక్టర్ : ఇప్పుడు వర్షాలు పడటం మొదలైంది. కాబట్టి ప్రతి ఒక్కరు దోమల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిసరాలలో నీరు నిలువ లేకుండా చూసుకోవాలి. కొబ్బరిచిప్పలు తదితర వాటిల్లో నీరు నిలువ ఉండటం మూలాన దోమలు తయారై డెంగ్యూ, మలేరియా వంటి విషజ్వరాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. వర్షాలవల్ల నీరు కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. కలుషిత ఆహారం, నీరు తీసుకోవడం మూలాన అతిసార వ్యాధికి గురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే పరిసరాలలో నీరు నిలువ ఉండకుండా జాగ్రత్త వహించాలి.
నవతెలంగాణ : డెంగ్యూ జ్వరం గురించి వివరిస్తారా?
డాక్టర్ : డెంగ్యూ జ్వరం ఎడిసిజిప్టి అనే దోమకాటువల్ల సంక్రమించే వ్యాధి, డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలు అధిక జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, కండరాలు,కీళ్ల నొప్పులు. కొన్ని తీవ్రమైన కేసులు రక్తస్రావం, షాక్‌కు దారితీస్తాయి, ఇది ప్రాణాంతకమవుతుంది. సాధారణంగా సంక్రమణ తర్వాత నాలుగు , ఆరు రోజుల నుండి ప్రారంభమవుతాయి.10 రోజుల వరకు ఉంటాయి. ఆకస్మిక అధిక జ్వరం (105 డిగ్రీలు), కాలేయం పెద్దదిగా మారడం ,రక్త ప్రసరణ వ్యవస్థ వైఫల్యం వంటి అరుదైన సమస్యలు ఇందులో ఉన్నాయి. లక్షణాలు భారీ రక్తస్రావం, షాక్ మరణంగా మారవచ్చు. దీన్నే డెంగ్యూ షాక్ సిండ్రోమ్ (DSS) అంటారు. మీ రక్తనాళాలు దెబ్బతిన్నప్పుడు, లీకేజీ అయినప్పుడు తీవ్రమైన డెంగ్యూ వస్తుంది. మీ రక్తప్రవాహంలో గడ్డకట్టే కణాల సంఖ్య (ప్లేట్‌లెట్స్) తగ్గుతుంది . ఇది స్ట్రోక్, అంతర్గత రక్తస్రావం, అవయవ వైఫల్యం, మరణానికి కూడా దారితీస్తుంది. ఎవరికైనా డెంగ్యూ జ్వరం లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
నవతెలంగాణ : మలేరియా జ్వరం గురించి వివరిస్తారా ?
డాక్టర్ : అన్ని దోమలు మలేరియాను వ్యాప్తి చేయవు. మలేరియా అనేది ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల కలిగే ప్రాణాంతకమైన దోమల ద్వారా సంక్రమించే అంటు వ్యాధి, కేవలం అనోఫిలస్ అనే ఆడ జాతి దోమల వల్ల మాత్రమే మనుషులకు మలేరియా సోకుతుంది. గర్భంలో ఉన్న శిశువుకు తల్లి నుంచి వ్యాధి రావచ్చు. వ్యాధిగ్రస్తుని రక్తం ఎక్కించడం వలన, వ్యాధిగ్రస్తుడు వాడిన సిరంజిని వాడడంతో కూడా మలేరియా బారిన పడవచ్చు.
నవతెలంగాణ : మలేరియా జ్వరం లక్షణాలు, నివారణ ?
డాక్టర్: మలేరియా సాధారణ లక్షణాలు జ్వరం, చలి, తలనొప్పి, వికారం, వాంతులు, అలసట, పొత్తికడుపు నొప్పి, వేగంగా శ్వాస తీసుకోవడం, దగ్గు మొదలైనవి. ప్రస్తుతం మలేరియాకు సమర్థవంతమైన చికిత్స అందుబాటులో ఉంది. అయితే సమయానికి చికిత్స చేయించుకోకపోతే మలేరియా ప్రాణాంతకంగా పరిణమిస్తుంది.
నవతెలంగాణ : అతిసార వ్యాది కలగడానికి గల కారణాలు ? లక్షణాలు ?
డాక్టర్ : వర్షాకాలంలో త్రాగునీరు కలుషితమయ్యే అవకాశం ఎక్కువ, కలుషిత ఆహారం, నీరు తీసుకోవడం మూలాన అతిసార వ్యాదికి గురవుతారు. వ్యాధి లక్షణాలు వాంతులు, విరేచనాలు, తక్కువ ఉష్ణోగ్రతతో జ్వరం, డీసెంట్రి ఐతే రక్త విరేచనాలు, వికారంగా ఉండడం, అన్నహితం లేకపోవడం, మాములుగా ఈ జబ్బు 2-3 రోజులలో తగ్గిపోతుంది. పిల్లల్లో అతిసారం సాధారణంగా ఐదు నుంచి ఏడు రోజుల లోపల తగ్గిపోతుంది లేదంటే రెండు వారాల వరకు ఉంటుంది. అతిసార వ్యాధిని అంగ్ల భాషలో డయేరియా అంటారు. అతిసార వ్యాధి మామూలుగా వైరస్ వల్ల వస్తుంది. రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగిన పిల్లలకు రోటా వైరస్ వల్ల వస్తుంది. ఇదే అతిసార వ్యాధితో పాటు నెత్తురు పడితే ‘డీసెంట్రీ’ అంటారు. పిల్లలో మృత్యువుకు ఇది అతి ముఖ్యమైన కారణం. డీసెంట్రి వివిధ రకాలైన బ్యాక్టీరియా, ప్రోటోజోవాల ద్వారా వల్ల వస్తుంది. కలరా కూడా ఒక రకమైన అతిసార వ్యాధి.రోగి బ్రతికితే డయేరియా చస్తే కలరా అంటారని సామెత . వరల్డ్ హెల్త్ ఆర్గనైసేషన్ ప్రకారం ఒక మనిషి రోజులో మూడు లేక అంతకంటే ఎక్కువ సార్లు వదులుగా వీరేచనాలు చేసుకుంటే దానిని అతిసారం అంటారు.ఐదు సంవత్సరాల లోపు పిల్లలలో మరణానికి అతిసార వ్యాధి రెండవ ప్రధాన కారణం. అతిసార వ్యాధి సురక్షిత నీరు తాగుతు, పరిశుభ్రత పాటించడము వలన నివారించవచ్చు.
నవతెలంగాణ : డయాబెటిస్, అధిక రక్తపోటు చాలా మందిలో సాధారణంగా కనిపిస్తున్న అనారోగ్య సమస్య వీరికి మీరిచ్చే సూచన ?
డాక్టర్ : మంచి ఆహారపు అలవాట్లు, క్రమం తప్పని వ్యాయామం ఆరోగ్యవంతమైన జీవన విధానానికి పునాది. డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్నవ్యక్తులు మితమైన ఆహారం ఎక్కువసార్లు తీసుకోవడంతో పాటు వైద్యుని సంప్రదిస్తూ అతని సలహామేరకు క్రమం తప్పని కనీసం 30 నుండి 45 నిమిషాల వేగవంతమైన నడక లేక వ్యాయామం చేయడంవల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.