విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలి: డాక్టర్ జీ రమణ 

High goals should be set at the student stage itself: Dr G Ramana– పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి
నవతెలంగాణ – రామారెడ్డి
జిల్లా మానసిక ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మండలంలోని ఉప్పల్వాయి  సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల /జూనియర్ కళాశాలలో మానసిక ఆరోగ్యం పై శుక్రవారం అవగాహన సదస్సును నిర్వహించారు. జిల్లా మానసిక వైద్యాధికారి జి.రమణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… విద్యార్థులు ప్రధానంగా మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారని, వాటిని అధిగమించడానికి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ దశలో విద్యార్థులు ప్రేమ సంబంధిత ఆకర్షణలకు లోనవుతారని అది కేవలం వయసు రీత్యా వచ్చే ఆలోచనలేనని వాటి పట్ల విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని, అలాగే మత్తు పదార్థాల జోలికి అస్సలు వెళ్ళకూడదని తెలియజేశారు.  మొబైల్ వినియోగాన్ని కేవలం సమాచార సేకరణకు మాత్రమే వినియోగించాలని, వినోదం కోసం వినియోగిస్తే మొబైల్ ఫోన్లకు బానిసలు అవుతామని, చదువుపై శ్రద్ధ తగ్గుతుందని తెలిపారు. పరీక్షా కాలంలో విద్యార్థులు ఒత్తిడికి గురికావద్దని ,ముందు నుండే ప్రణాళిక ప్రకారం  చదువుకోవాలని, అందుకు తగ్గ వాతావరణాన్ని సృష్టించుకోవాలని సూచించారు. మానసికంగా ఎటువంటి సమస్యలు వచ్చినా దగ్గర్లోని వైద్య అధికారిని గాని, సైకియాట్రిస్ట్ ని సంప్రదించాలని సూచించారు. ఉచిత టోల్ ఫ్రీ నెంబర్ 14416ని సైతం వినియోగించుకొని కౌన్సెలింగ్ పొందవచ్చునని సూచించారు.  కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శివరాం, జిల్లా సోషల్ వర్కర్ డా. రాహుల్ కుమార్, అధ్యాపకులు సురేందర్ రెడ్డి,హరిసింగ్,బాబు,సౌందర్య, ఆరోగ్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.