నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో విద్యావ్యవస్థ ఆగమైపోయిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు విమర్శించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ప్రేమ్ వర్క్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల పనితీరు దీనికి అద్దం పడుతున్నదని తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ర్యాంకు 70వస్థానానికి పడిపోయిందన్నారు. మిగతా యూనివర్సిటీల పరిస్థితి మరింత దారుణంగా ఉందని తెలిపారు. అగ్రికల్చర్ విభాగంలో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ 37వ స్థానానికి దిగజారిందని చెప్పారు. కళాశాలల విభాగంలో టాప్-100లో తెలంగాణ నుంచి ఒక్క కాలేజీ కూడా ఎంపిక కాలేదని విమర్శించారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో 2400 ఖాళీలు వెక్కిరిస్తున్నాయనీ, ఓయూలో 1268 పోస్టులకు 848 ఖాళీలు, కాకతీయలో 403 పోస్టులకు 293 ఖాళీలున్నాయని వివరించారు. ఖాళీలపై రాష్ట్ర సర్కారు హైపవర్ కమిటీలు వేసి కాలంవెళ్లదీస్తున్నదని విమర్శించారు. కనీసం వీసీలను కూడా నియమించలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. రూ.7510 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో 14,028 స్కూళ్లలో విద్యార్థినులకు టాయిలెట్స్ కూడా లేవన్నారు. 24వేల టీచర్ పోస్టుల భర్తీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో 30 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 29 లక్ష్లల మంది విద్యార్థులుంటే.. 10 వేల ప్రయివేటు స్కూళ్లలో 30 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీల పట్ల నిర్లక్ష్యం వీడి రీసెర్చ్ కోసం నిధులు కేటాయించాలనీ, వీసీల నియామకం పూర్తి చేయడంతో పాటు స్కూళ్లలో టీచర్ల నియామకం చేపట్టాలని డిమాండ్ చేశారు.