నవతెలంగాణ – భువనగిరి
భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్శిటీ 2024 మే 17 నుండి 18వ తేదీ వరకు పరిశోధనలో సృజనాత్మకత, ఆవిష్కరణలపై 3వ అంతర్జాతీయ సదస్సును హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ ఈశ్వరి, ( సీడీఏసీ, సెంటర్ హెడ్), (మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, భారత ప్రభుత్వం), ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వివిధ రంగాలలో పరిశోధనలో సృజనాత్మకతను చేర్చడం మరియు సీడీఏసీ యొక్క విధుల గురించి వివరించారు.విశ్వనాథ్ నాయక్, మాజీ డైరెక్టర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ, (భారత ప్రభుత్వం) ఇంజనీరింగ్, అనుబంధ రంగాలలోని సమస్య పరిష్కార సాంకేతికతలను గురించి వివరించారు. బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్శిటీ ఛాన్సలర్, డాక్టర్ రూపా వాసుదేవన్ వినూత్న ఉత్పత్తులు మరియు ప్రక్రియలకు దారితీసే ఇంటర్ డిసిప్లినరీ పరిశోధనల గురించి ప్రతినిధులకు వివరించారు. వైస్-ఛాన్సలర్ డాక్టర్ నాగజ్యోతి ప్రతినిధులకు స్వాగతం పలికారు మరియు విద్యార్థులు, అధ్యాపకులలో పరిశోధన మరియు ఆవిష్కరణలను బెస్ట్ ఇన్నోవేషన్ విశ్వవిద్యాలయం ఎలా ప్రోత్సహిస్తుందో వివరించారు. ఈ సదస్సులో వివిధ రాష్ట్రాలు, విదేశాల నుండి సుమారు 300 మంది ప్రతినిధులు పాల్గొని పరిశోధనా పత్రాలను సమర్పించారు. ఉత్తమ పేపర్ ప్రజెంటర్లకు అవార్డులు, ప్రతినిధులందరికీ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.