ఈ సృష్టిలో ప్రాణాలు పోసేది తల్లితండ్రులు అయితే, ప్రాణాలు కాపాడేది వైద్యులు. అందుకే మన పూర్వీకులు గ్రంథాల్లో వైద్యో నారాయణో హరి అన్నారు. అలాంటి పవిత్రమైన వైద్య వృత్తిలో కొనసాగుతూ, కాసుల సంపాదనలో కొందరు వైద్యులు వృత్తికే కళంకం తెస్తున్నారు. మరోవైపు కొందరు వైద్యులు తమ అత్యవసర వైద్య సేవలతో వృత్తి గౌరవాన్ని పెంచుతున్నారు. ఇలా వైద్య వృత్తి గౌరవాన్ని పెంచుతున్న వారిలో నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మాజీ సూపరింటెండెంట్, ప్రముఖ డాక్టర్ ప్రతిమ రాజ్ ముందుంటారు. ఆమె ఎక్కడున్నా వైద్య వృత్తికే వన్నె తెస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి మూడు రోజుల కిందట మధ్యహ్నం మూడున్నర గంటలకు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతున్న విమానంలో జరిగిన ఓ సంఘటననే ప్రత్యక్ష నిదర్శనం. వివరాల్లోకి వెళ్తే….మూడు రోజుల కిందట అనురాధ అనే ప్రయాణికురాలు విజయవాడ నుంచి తన స్వస్థలం అయిన హైదరాబాద్ వెళుతుంది. ప్రయాణంలో ఆమెకు గుండె పోటు వచ్చింది. దీంతో విమాన సిబ్బంది అత్యవసర వైద్యానికి అనౌన్స్ మెంట్ చేశారు. విమానంలో ఎవరైనా వైద్యులు ఉంటే, వెంటనే వచ్చి అత్యవసర వైద్య చికిత్స అందించాలని కోరారు. స్పందించిన డాక్టర్ ప్రతిమ రాజ్ అత్యవసర వైద్యం చేయడానికి ముందుకు వచ్చారు. యుద్ధ ప్రతిపాదికన సేపీఆర్ చేశారు. విమాన సిబ్బంది అందించిన మెడికల్ ఎమర్జెన్సీ కిట్, ఆక్సిజన్ పరికరాలతోపాటు తన దగ్గర ఉన్న మెడికల్ కిట్లతో వైద్యం అందించారు. అత్యవసర వైద్యానికి రోగి అనురాధ స్పందించి వెంటనే కోలుకున్నారు. శ్వాస ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందారు. తిరిగి యధా స్థితికి వచ్చారు. దీంతో రోగి బంధువులు, ప్రయాణికులు, విమాన పైలట్, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అంతా సంతోషంతో చప్పట్లు కొట్టారు. విమానంలో ఇతర డాక్టర్లు ఉన్నప్పటికినీ, సకాలంలో స్పందించి అత్యవసర వైద్యం అందించిన డాక్టర్ ప్రతిమ రాజ్ కు రోగి అనురాధ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. తన ప్రాణాలు కాపాడిన డాక్టర్ ప్రతిమ రాజ్ కు జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొంది. విమాన పైలట్, సిబ్బంది, ప్రయాణికులు డాక్టర్ ప్రతిమ రాజ్ ను అభినందించి, ప్రశంసల జల్లు కురిపించారు. జీవితాంతం గుర్తుండిపోయేలా ఆమెతో ఫోటోలు దిగారు. వైద్య వృత్తికే వన్నె తెచ్చిన ప్రతిమ రాజ్ లాంటి వైద్యులు అరుదుగా ఉంటారని, ఆమెకు భగవంతుడు ఆయు ఆరోగ్యాలు ప్రసాదించి, వైద్య సేవలు అందించేలా చూడాలని దేవుణ్ణి కోరుకున్నారు. దీంతో గగనతలంలో సైతం నిజామాబాద్ ఖ్యాతి ఎగిరినట్టయింది.