హైదరాబాద్: ప్రముఖ ఔషధ ఉత్పత్తుల కంపెనీ డాక్టర్ రెడ్డీస్ లాభాల్లో స్వల్ప తగ్గుదల చోటు చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో సంస్థ నికర లాభాలు 0.90 శాతం తగ్గి రూ.1,392.4 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,335 కోట్ల లాభాలు ప్రకటించింది. ఇదే సమయంలో రూ.6,738.4 కోట్లుగా ఉన్న రెవెన్యూ.. క్రితం క్యూ1లో 14 శాతం పెరిగి రూ.7,672 కోట్లుగా చోటు చేసుకుంది. భారత మార్కెట్‌లో తమ రెవెన్యూ ఏడాదికేడాదితో పోల్చితే 15 శాతం పెరిగిందని ఆ కంపెనీ తెలిపింది. రష్యన్ రెవెన్యూలో 2శాతం తగ్గుదల చోటుచేసుకుందని పేర్కొంది. ఎమర్జింగ్ మార్కెట్ల రెవెన్యూలో 3శాతం పెరిగిందని వెల్లడించింది.