డ్రాగన్‌.. పోషకాల గని

Dragon.. a mine of nutrientsడ్రాగన్‌ ఫ్రూట్‌. ఈ పండుకు ప్రస్తుతం మార్కెట్‌లో భలే డిమాండ్‌ ఉంది. ప్రతి ఒక్కరూ ఈ పండు గురించి తెలుసుకొని తినడం మొదలుపెట్టారు. సెంట్రల్‌ అమెరికాలో ఎక్కువగా లభించే ఈ పండును.. ఈ మధ్య కాలంలో మన దేశంలో విరివిగా పండిస్తున్నారు. అందుకే మార్కెట్లో కూడా దీని సేల్స్‌ అమాంతం పెరిగిపోయాయి. రెడ్‌, వైట్‌, పింక్‌, ఎల్లో కలర్స్‌లో లభించే ఈ పండుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటి గురించి తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
డ్రాగన్‌ ఫ్రూట్‌ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఫైబర్‌ ఎక్కువగా ఉండడంతో జీర్ణక్రియను వేగవంతం చేసి, శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది. ఈ పండులో ఎక్కువ మొత్తంలో నీరు ఉండడం వల్ల.. ఇది వెంటనే అరిగిపోతుంది. ఇది వద్ధాప్య లక్షణాల నుంచి రక్షించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
బరువు తగ్గేందుకు…
డ్రాగన్‌ ఫ్రూట్‌లో చాలా తక్కువ మొత్తంలో క్యాలరీలు ఉంటాయి. అలాగే ఇందులో ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువ. ఈ పండు తినడం వల్ల ఆకలి తొందరగా వేయదు. దీంతో బరువు నియంత్రణలో ఉండడంతో పాటు బరువు తగ్గాలనుకునేవారు సులువుగా బరువు తగ్గొచ్చు. అలాగే ఇందులో ఉండే ఫైబర్‌ జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు కొవ్వును కరిగిస్తుంది. దీంతో బరువు అదుపులో ఉంటుంది.
మధుమేహాన్ని నియంత్రిస్తుంది
ఈ డ్రాగన్‌ ఫ్రూట్‌లో బీటా-సానిన్‌, ఫ్లేవనాయిడ్స్‌, ఫినోలిక్‌ యాసిడ్‌, ఆస్కార్బిక్‌ యాసిడ్‌, ఫైబర్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కావున ఈ పండు తినడం ద్వారా డయాబెటిక్‌ రోగుల్లో ఉండే పోషకాల లోపాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే ఈ పండు గ్లెసెమిక్‌ సూచిక చాలా తక్కువ. దీంతో ఈ ఫ్రూట్‌ తింటే డయాబెటిక్‌ రోగుల్లో షుగర్‌ను నియత్రించవచ్చు. దీంతో పాటు ఇందులో పుష్కలంగా లభించే విటమిన్‌-సి కారణంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
గుండె ఆరోగ్యానికి..
గుండె జబ్బులకు ప్రధానమైన కొలెస్ట్రాల్‌ ఎల్‌డిఎల్‌. అయితే డ్రాగన్‌ ఫ్రూట్‌ తినడం వల్ల.. గుండె జబ్బులకు ప్రధానంగా కారణమయ్యే ఈ ఎల్‌డిఎల్‌ కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. దీంతో గుండె సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు.
ఎముకలు బలపడడానికి..
ఎముకలు బలంగా ఉండాలంటే క్యాల్షియం తప్పనిసరిగా ఉండాలి. దీంతో పాటు కొన్ని పోషకాలు కూడా అవసరం. అయితే ఈ డ్రాగన్‌ ఫ్రూట్‌లో కాల్షియం, ఫాస్పరస్‌, మెగ్నీషియం వంటి పోషక విలువలు చాలా ఉన్నాయి. ఇవి తినడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి.
రక్తపోటు నియంత్రణకు…
ప్రస్తుతమున్న గజిబిజి కాలంలో రక్తపోటు అనేది ప్రధానమైన సమస్య. చాలా మంది అధిక రక్తపోటుతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వ్యక్తులు రోజూ ఈ డ్రాగన్‌ ఫ్రూట్‌ తినడం వల్ల.. రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్త ప్రసరణ సాధారణంగా జరుగుతుంది.