నాటకం రవి కాదు

కచ్చితంగా తెలతెలవారుతుంది
సూర్యోదయం మెలమెల్లగా లోకమంతా పరుచుకుంటుంది
ఘనీభవించిన కటిక చీకటి ముసుగులు
ప్రక్షాళనతో కరిగి నీరైపోతాయి
వెలుగు కిరణమెప్పుడు నగ తీక్షణమే
క్షణక్షణం ప్రచండవేగంతో రగిలేజ్వాలకు
తిమిరం దహించకుండా వుంటుందా..?
తెలవారినంత సహజంగానే
పాలవెలుగుల్లో తెరతొలుగుతుంది
భూపాలరాగం ప్రకృతి ధ్వనులతో మనోహరమే…
సరికొత్త ప్రపంచం నునువెచ్చగా
రంగప్రవేశం చేస్తుంది
ప్రియురాలిలా కవ్విస్తుంది
చక్షువులను కట్టిపడేస్తుంది
నవోత్సాహ నవోన్మేష రసఝరిలో
కేళీవిలాస స్వైరవిహారం..

నాటకం రవిలా సూటిగా ఉండదు గాక వుండదు
చిత్ర విచిత్ర మలుపులు అనూహ్యపరిణామాలు
ఆనంద విషాదాశ్రుతుషార బిందువులు
ఆశ్చర్య దిగ్భ్రమలు భయానక బీభత్సాలు
కరుణామృత శాంత ధారాపాతాలు ఓV్‌ా… ఒకటేమిటి?
అన్నీ నిత్య నూతనాలే. సరికొత్త జీవన పాఠాలే
నాటకం కవిలా రసప్లావితుడ్ని చేస్తుంది
కపిలా కుప్పిగంతులేయిస్తుంది
అల్లరి పిల్లలా మారం చేస్తుంది
ప్రకృతినే పరవశింపచేస్తుంది
ఒక్క మాటలో.. రసజగత్తులో ఓలలాడిస్తుంది
మామూలు నేత్రాలకు అందని గుణం
మనోనేత్రానికే దక్కే అపురూప వరం
త్రినేత్రా! నటరాజా! ఉపాసకా! ఎందుకింత ఆలస్యం?
నాటకాన్ని ఆవాహన చేసుకో. అనంత విశ్వానికి
నీ రసహృదయంలో కాసింత చోటిచ్చుకో…
జన్మ తరించుకో…
– శాంతారావు. కె