బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌వి తెరవెనుక నాటకాలు

BRS Congress Dramas behind the scenes– ఎన్‌డీఏలోకి గులాబీ పార్టీ చేరికను తిరస్కరించాం
– కాంగ్రెస్‌ ఓట్లు కొనుక్కునే కాంట్రాక్ట్‌ పార్టీ
– పసుపు బోర్డుతో రైతుల అభివృద్ధి : బీజేపీ జనగర్జన సభలో ప్రధాని మోడీ
నవతెలంగాణ-నిజామాబాద్‌(నవీపేట్‌)
కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపునకు కేసీఆర్‌ తెలంగాణ ఖజానా అందించారని, అది 100 శాతం నిజమని ప్రధాని మోడీ వెల్లడించారు. కర్నాటకలో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించేందుకు కేసిఆర్‌, ఓవైసీలు కృషి చేశారని, ఎలాగైనా ఓట్లు కొనే కాంట్రాక్టుకు తెర వెనుక ఉండి సహకరించారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలవి తెరవెనుక నాటకాలని అన్నారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో మంగళవారం ప్రధాని మోడీ పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం చేపట్టి జాతికి అంకితం చేశారు. అనంతరం జీజీ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించిన బీజేపీ జనగర్జన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రూ.8వేల కోట్లతో ఆధునిక సాంకేతికతో చేపట్టిన ఎన్టీపీసీకి చెందిన 800 మెగావాట్ల తెలంగాణ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టుతో తెలంగాణకే ఎక్కువ భాగం దక్కుతుందని తెలిపారు. దాన్ని ప్రజలకు అంకితం చేసే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తెలంగాణలో క్రిటికల్‌ కేర్‌ కనెక్టివిటీ పెరుగుతూ తెలంగాణ వికాసం చెందుతుందని తెలిపారు. ఇదే బీజేపీ సంకల్పమని అన్నారు. మహిళలు తనకు స్వాగతం పలికిన తీరు జీవితంలో మర్చిపోలేనని చెప్పారు. వందల మంది యువకుల బలిదానాలతో వచ్చిన తెలంగాణలో.. రాష్ట్ర ఖజానా ఒకే కుటుంబం దోచుకుంటుందని, మీరు వేసే ఓటు మీకోసం కాకుండా కల్వకుంట్ల కుటుంబ అభివృద్ధికి ఉపయోగపడుతుంద న్నారు. అలాంటి వారికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీఆర్‌ఎస్‌ పాపాలను ఎండగట్టే బాధ్యత తనదని తెలిపారు.
కేసీఆర్‌ గురించి మీకెవరికీ తెలియదని, మీకెప్పుడూ చెప్పని నిజం ఇప్పుడు చెబుతున్నానని, జీహెచ్‌ఎంసీ ఎన్నికలకి ముందు కేసీఆర్‌ తనని కలిశారని, పెద్దపెద్ద పూలదండలు తీసుకొచ్చి సన్మానం చేశారని తెలిపారు. నా హయాంలో దేశం దూసుకుపోతుందని భజన చేశారని చెప్పారు. ఎన్‌డీఏ కూటమిలో భాగం అవుతామని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సహకరించాలని కోరారని తెలిపారు. కానీ ప్రజల తీర్పే అంతిమమని, ప్రతిపక్షంలో అయినా ఉంటాం కానీ తాము బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వమని స్పష్టంచేశామని తెలిపారు. ఎన్నికల తర్వాత మళ్ళీ ఒకసారి ఢిల్లీకి వచ్చి తన కుమారుడు కేటీఆర్‌ను ఆశీర్వదించాలని కోరారని, ప్రజలే ఆశీర్వదిస్తారని, ఎవరు కావాలో ప్రజలే నిర్ణయిస్తారని తిరస్కరించండతో అప్పటి నుంచి పత్తా లేకుండా పోయారన్నారు. తెలంగాణలో ఇంకా రాజరికం కావాలని కేసీఆర్‌ భావిస్తున్నారని, అందుకే తన తర్వాత తన కొడుకును సీఎం చేయాలని కేసీఆర్‌ చూస్తున్నారని, ప్రజలు అంతా గమనిస్తున్నారని అన్నారు. దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకమని, కరోనా సమయంలో వ్యాక్సిన్‌ను ప్రపంచానికి అందించిన కీర్తి తెలంగాణకు దక్కిందని అన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును తెచ్చేందుకు ప్రతిపక్షాలను బలవంతంగా ఒప్పించే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఇండియా కూటమి ఈ విషయంలో ప్రజలకు జవాబు ఇవ్వాలన్నారు.
పేదరిక నిర్మూలనే తన సంకల్పమని, దీనికి ప్రతిపక్షాలు సైతం సంకల్పం చేయాలని ఆకాంక్షించారు. తెలంగాణ మహిళల కాళ్లు తన తలపై పెట్టుకుంటానని, ఎందుకంటే వారు కష్టపడి పండించిన పసుపు కరోనా సమయంలో ప్రపంచాన్ని రక్షించిందని అన్నారు. అటువంటి రైతుల అభివృద్ధి కోసం నేషనల్‌ టెర్మినల్‌ బోర్డును ఏర్పాటు చేశామని తెలిపారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ వస్తేనే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రతి కార్యకర్త బూత్‌ లెవల్‌ నుంచి కమలం పువ్వును ఇంటింటికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ ధర్మపురి అరవింద్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ధన్‌పాల్‌ సూర్యనారాయణగుప్త, బీజేపీ జిల్లా అధ్యక్షులు బస్వ లక్ష్మినర్సయ్య తదితరులు పాల్గొన్నారు.