నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని నాగపూర్ గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీ, గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను శనివారం మండల ప్రత్యేక అధికారి, డి ఆర్ డి ఓ సాయ గౌడ్ సందర్శించి పరిశీలించారు. ఎండలు ఎక్కువైనందున నర్సరీల్లో మొక్కలకు ఉదయం, సాయంత్రం రెండు సమయాల్లో నీటిని అందించాలని నర్సరీల నిర్వహకులకు సూచించారు. ఎండల నుండి మొక్కలను కాపాడేందుకు షెడ్ నెట్ లను ఏర్పాటు చేసుకోవాలని, మొక్కల సంరక్షకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఏవైనా మొక్కలు ఎండిపోతే తక్షణమే వాటి స్థానంలో కొత్త మొక్కలను సిద్ధం చేయాలన్నారు. నర్సరీలో మొక్కల పెంపకంలో అలసత్వం చూపొద్దని, నిర్దేశించిన లక్ష్యం మేరకు నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేయాలన్నారు. ఈ సందర్భంగా నర్సరీల నిర్వాహకులకు పలు సలహాలు సూచనలు చేశారు. అనంతరం ఉపాధి హామీ పనులు కొనసాగుతున్న ప్రదేశాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన కూలీల హాజరు రిజిస్టర్ ను తనిఖీ చేశారు. ఉపాధి కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వేసవి ఎండల తీవ్రత పెరిగినందున పని ప్రదేశంలో కూలీలు సేద తీరేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, ఎండల బారిన పడకుండా ఉండేందుకు ఓఆర్ఎస్ పాకెట్లను అందుబాటులో ఉంచాలని ఈజీఎస్ సిబ్బందికి సూచించారు. కొలతల ప్రకారం పక్కాగా రికార్డుల్లో నమోదు చేయాలన్నారు.పని ప్రదేశంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని కూలీలకు సూచించారు. అంతకుముందు గ్రామపంచాయతీలో రికార్డులను తనిఖీ చేశారు. గ్రామంలో పలు నివాస గృహాలను సందర్శించి పారిశుధ్య అన్ని పరిశీలించారు.అనంతరం మండల కేంద్రంలోని గాంధీ నగర్ లో వాటర్ ట్యాంకులను పరిశీలించారు. ట్యాంక్ లను ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయాలని పంచాయతీ కార్యదర్శి శాంతి కుమార్ కు సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో చింత రాజా శ్రీనివాస్, మండల పంచాయతీ అధికారి సదాశివ్, ఈజీఎస్ ఏపీవో విద్యానంద్, కార్యదర్శి సంధ్య, ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, మెట్లు, తదితరులు ఉన్నారు.