నవతెలంగాణ – అశ్వారావుపేట
మహిళా భాగస్వామ్యంతోనే సంక్షేమ పధకాల సఫలం కావడంతో పాటు అమలు విజయవంతం అవుతాయని డీఆర్డీవో,అదనపు కలెక్టర్ విద్యా చందన అన్నారు. నాలుగు పధకాలను అమలు చేయడం కోసం లబ్ధిదారుల ఎంపిక కై తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన లో భాగంగా గురువారం మండలంలోని నారంవారిగూడెం కాలనీలో జరిగిన గ్రామ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ గ్రామ సభకు అత్యధికంగా మహిళలే హాజరు కావడం గమనించిన ఆమె మాట్లాడుతూ ప్రజా సంక్షేమ కోసం చేపట్టే కార్యక్రమాల్లో అత్యధికంగా మహిళలు పాల్గొనడం శుభపరిణామం అన్నారు. సంక్షేమ పధకాలు అమలు చేయడం నిరంతర ప్రక్రియ అన్నారు.ఎవరు దరఖాస్తు ఎపుడు ఇచ్చినా స్థానిక సిబ్బంది స్వీకరిస్తానని తెలిపారు. అనంతరం అటవీ శాఖ ఆద్వర్యంలో పెంచుతున్న వెదురు నర్సరీ ని తనిఖీ చేసారు.నర్సరీ నిర్వహణ,మొక్కలు పెంపుదల విషయాలను స్థానిక ఇంచార్జి ఎఫ్.బీ.ఓ నరేష్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ సూపర్వైజర్ రాజు,తహశీల్దార్ వి.క్రిష్ణ ప్రసాద్,ఎం.పీ.డీ.ఓ ప్రవీణ్ కుమార్,ఈజీఎస్ ఏపీఓ రామచంద్రరావు లు ఉన్నారు.