– ఖాళీ బిందెలతో మహిళలు ఆందోళన
నవతెలంగాణ – మల్హర్ రావు
రోజురోజుకూ ఎండలు మండుతున్నాయి.దీంతో ఇప్పటికే మండలంలో భూగర్భ జలాలు 450 అడుగులు లోతుకు అడుగంటాయి.మండలంలో సోమవారం 40 డిగ్రిల పైనే ఉష్ణోగ్రత నమోదైనట్లుగా తెలుస్తోంది. సాగు నీటి ఇబ్బందులే కాకుండా తాగునీటి ఇబ్బందులు సైతం ప్రారంభమైయ్యాయి.ఇందుకు సాక్షాత్తు నిదర్శనమే మండల కేంద్రమైన తాడిచెర్లలోని రేగడి పల్లి 8వ వార్డులో గత నాలుగైదు రోజులుగా తాగునీటి ఎద్దడి ఏర్పడిందని ప్రజలు వాపోతున్నారు. సోమవారం ఖాళీ బిందెలతో తాగునీటి సమస్యను పరిస్కారం చేయాలని ఆందోళన, నిరసన చేపట్టారు.తాగునీటి సమస్యపై స్థానిక అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడం లేదని,ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు ప్రజల దాహార్తి తీర్చాలని విజ్ఞప్తి చేశారు. వార్డులో ఉన్న బోర్ మోటార్ లో భూగర్భ జలాలు తగ్గడంతో నీరు తక్కువగా పోస్తోందని వార్డు ప్రజలు చెబుతున్నారు.దీనికి తోడుగా మిషన్ భగీరథ పైప్ లైన్ సైతం వేయకపోవడంతో ప్రజలు మూడు రోజుల కొక్కసారి స్నానం చేస్తున్నట్లుగా వాపోతున్నారు.గొంతు తడుపుకునేందుకు వ్యవసాయ,లేదా ప్రక్క వార్డుల్లో బోర్ మోటర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. అసలే ఎండలు మండుతున్న నేపథ్యంలో తాగేందుకు గుక్కెడు నీరు లేక అల్లాడుతున్నామని మండిపడ్డారు.ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రక్కనున్న బోర్ బావుల వద్దకు నీటి కోసం వారు రావద్దని చెబుతున్నట్లుగా ప్రజలు వాపోతున్నారు.గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ తోపాటు ఉన్నతాధికారులు పలుమార్లు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. అయిన రేగడి పల్లిలోని నీటి సమస్యను ఎవరు పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు తాగునీటి సమస్యను పరిస్కారం చేయాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.
మూడు రోజులకొక్క సారి స్నానం చేస్తున్నాం: బొంతల సమ్మక్క గృహిణీ
భూగర్భ జలాలు అడుగంటడంతో మా వార్డులో ఉన్న బోర్ నీరు తక్కువగా పోస్తుంది.దీంతో అందరికి నీరు అందక మూడు రోజులకొక్క సారి స్నానం చేస్తున్నాం.మిషన్ భగీరథ పైప్ లైన్ వేయకపోవడంతో ఆనీరు మాకు రావడం లేదు. ఇప్పటికైనా అధికారులు తాగునీటి సమస్యను పరిస్కారం చేయాలి.
మిషన్ భగీరథ నీరు అంధించాలి: నీలం రాజేశ్వరి గృహిణి
గ్రామంలో మిషన్ భగీరథ పైప్ లైన్ వేసి మా 8వ వార్డుకు మాత్రం వేయలేదు.ఇందుకు తోడుగా ఉన్న ఒక్క బోరులో నుంచి నీరు అందడం లేదు దీంతో తాగునీటికి నాలుగైదు రోజులుగా అల్లాడుతున్నాం. అధికారులు పట్టించుకోని తాగునీటి సమస్యను పరిస్కారం చేయాలి.లేదంటే ఎంపిడిఓ కార్యాలయం ముందు ఆందోళన చేస్తాం.