మద్దికుంటలో త్రాగునీటి సమస్య

నవతెలంగాణ – రామారెడ్డి

గ్రామాలల్లో తాగునీటి సమస్య ఉండకూడదని ప్రభుత్వం, ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి అధికారులకు, ప్రజా ప్రతినిధులకు సూచించిన, క్షేత్రస్థాయిలో అధికారులు, ప్రజా ప్రతినిధులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో మండలంలోని మద్దికుంటలో తాగునీటి సమస్య ఏర్పడింది. మద్దికుంట ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని, గ్రామంలో నీటి ఎద్దడి ఉండకుండా గతంలో ట్యాంకర్లతో కూడా నీరు అందించేవారు. ఈ సంవత్సరం మిషన్ భగీరథ నీరు సరిపడ రాకపోవడం, భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో అధికారులు ముందస్తుగా ట్యాంకర్లతో నీరందించకపోవడంతో గ్రామంలో నీటి ఎద్దడితో మహిళలు కాలినడకన పంట పొలాల నుండి నీరు తెచ్చుకుంటున్నారు. గ్రామ నడిబోడ్డున గత సంవత్సరం నుండి ట్యాప్ ఏర్పాటు చేయకపోవడంతో నీరు వృధాగా పోతుంది. తాగునీటి సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని గ్రామంలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.