– ఖాళీ బిందెలతో మహిళల నిరసన
నవతెలంగాణ-గణపురం
జయశంకర్-భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని సీతారాంపురం గ్రామ ప్రజలు గత 2 నెలలుగా మంచినీటి కోసం తండ్లాడుతున్నారు. పాలకులు, అధికారులకు విన్నవించినా పట్టించుకోక పోవడంతో శుక్రవారం మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ.. సీతారాంపురం గ్రామంలోని మన్నెపు కాలనీలో దాదాపు 50 ఇండ్లు ఉంటాయని, కాలనీకి గత ప్రభుత్వ ఒక బోరు వేయిస్తే.. తామే పైప్ లైన్ వేసుకున్నామని తెలిపారు. రెండ నెలల కిందట బోరు మోటార్ కాలిపోతే తామే మరమ్మతు చేయించుకున్నామన్నారు. ప్రస్తుతం మోటార్ మళ్లీ కాలిపోయిందని, కొత్త మోటార్ ఏర్పాటు చేయడంలో అధికారులు, పాలకులు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో నాయకులు వచ్చి కొత్త మోటార్ బిగిస్తామని హామీలిచ్చి విస్మరించారని అన్నారు. అప్పటి ప్రభుత్వం గ్రామాలకు మంచినీటిని అందించేందుకు మిషన్ భగీరథ పైప్ లైన్ వేసినా.. చుక్క నీరు రావడం లేదని తెలిపారు. ప్రతి కాలనీకి మిషన్ భగీరథ పైప్ లైన్ వేసి నల్లాలు బిగించినా నీటి సరఫరా చేయట్లేదన్నారు. అధికారులు, పాలకులు స్పందించి మంచినీటి కష్టాలను తీర్చాలని విజ్ఞప్తి చేశారు.