– జిఎంఆర్ పోచంపల్లి హైవేస్ ప్రాజెక్టు మేనేజర్ వెంకటరమణ
నవతెలంగాణ-మనోహరాబాద్
ప్రమాదాల నివారణ కోసం వాహనాల డ్రైవర్లు విధిగా కంటి పరీక్షలు నిర్వహించుకోవాలని జిఎంఆర్ పోచంపల్లి హైవేస్ ప్రాజెక్టు మేనేజర్ వెంకటరమణ సూచించారు. తూప్రాన్ మున్సిపల్ పరిధిలోగల తూప్రాన్ టోల్ ప్లాజా సమీపంలో జాతీయరహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా శనివారం జి.యం.ఆర్ పోచంపల్లి హైవేస్, జి.యం.ఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుష్పగిరి కంటి ఆసుపత్రి, సికింద్రాబాద్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటరమణ మాట్లాడుతూ వాహనదారుల కంటి చూపు సరిగా లేకపోవడం వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. కాబట్టి ప్రతి వాహనదారుడు క్రమం తప్పకుండ కంటి పరీక్షలు చేయిం చుకోవాలని సూచించారు. జియంఆర్ పోచంపల్లి హైవేస్ సిబ్బంది, రక్షా సిబ్బంది, పుష్పగిరి కంటి ఆసుపత్రి కోఆర్డినేటర్ వేణు ప్రసాద్, సిబ్బంది, ఫౌండేషన్ ఇంచార్జ్ శ్రీనివాస్, వాహనదారులు పాల్గొన్నారు.